ఇప్పుడీ ఉప ఎన్నికలు అవసరమా?
Published Thu, Aug 8 2013 4:27 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రస్తుత లోక్‌సభ గడువు మరో తొమ్మిది నెలల్లో ముగియనున్న తరుణంలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు అవసరమా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి అధికార దాహం వల్లే ఈ స్వల్ప కాలానికి ఉప ఎన్నికలు జరపాల్సి వచ్చిందని విమర్శించారు. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో నగర శివార్లలోని గొట్టిగెరె వద్ద నైస్ రోడ్డు పక్కన బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
కుటుంబ రాజకీయాలంటే దేవెగౌడకు ఎక్కడలేని కోపం వస్తుందని ఎద్దేవా చేస్తూ.. ఆయన చేసేవంతా కుల రాజకీయాలేనని ధ్వజమెత్తారు. బీజేపీతో అవగాహన కుదుర్చుకున్న జేడీఎస్ ఇకమీదట సెక్యులర్ పార్టీ ఎలా అవుతుందని నిలదీశారు. కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి జేడీఎస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు కూడా ఏకమయ్యాయని ఆరోపించారు. ఆయన కుటుంబం తప్ప ఇంకెవరైనా పచ్చగా ఉంటే దేవెగౌడ సహించరని విమర్శించారు. వారికి అండగా నిలిచిన వారినే రాజకీయంగా అంతమొందిస్తారని ఆరోపించారు. ‘వాళ్లింట్లో ఎప్పుడూ పండుగ భోజనాలుండవు, చావు భోజనాలే’ అని ఎద్దేవా చేశారు.
కుమారస్వామి ఏనాడూ లోక్‌సభకు హాజరైన పాపాన పోలేదని, ఇప్పుడు ఆయన సతీమణి అనితను గెలిపిస్తే లోక్‌సభ సమావేశాలకు హాజరవుతారా అని ప్రశ్నించారు. కనుక ఆమెతో పాటు మండ్యలో జేడీఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జేడీఎస్‌తో అంతర్గత ఒప్పందం ద్వారా రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలపనందుకు ఆయన బీజేపీని తూర్పారబట్టారు. గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గంలో రెండున్నర లక్షల ఓట్లను పొందిన ఆ పార్టీ, ఇప్పుడు తమ అభ్యర్థిని పోటీ చేయించడం లేదంటూ ‘బీజేపీ వారికి సిగ్గు లేదా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు ప్రసంగించిన కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర బీజేపీ మద్దతు తీసుకుంటున్న దేవెగౌడ, రేపు లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మద్దతిస్తారా అని నిలదీశారు. తమ పార్టీ అభ్యర్థిగా బెంగళూరు గ్రామీణ స్థానంలో పోటీ చేస్తున్న డీకే. సురేశ్, 2014 ఎన్నికల్లో కూడా బరిలో ఉంటారని ఆయన వెల్లడించారు. ఈ సభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు ప్రసంగించారు.
Advertisement