వేధింపులు కాదు.. లైంగికదాడి
Published Sun, Oct 9 2016 11:26 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
చాంద్రాయణగుట్ట: పది రోజుల క్రితం ఛత్రినాక ఠాణాలో నమోదైన బాలికపై వేధింపుల కేసు మలుపు తిరిగింది. బాధితురాలు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించని కారణంగా మొదట వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక తేరుకొని మరోసారి ఇచ్చిన ఫిర్యాదుతో లైంగిక దాడి కేసు నమోదు చేశారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఆదివారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజిత్ కుమార్ (18) కుటుంబంతో పాటు మరికొన్ని కుటుంబాలు ఉప్పుగూడ శివాజీనగర్‌లో ఉంటూ పీసు మిఠాయి విక్రయిస్తూ జీవిస్తున్నాయి. అజిత్ తన ఇంటి పక్కనే ఉండే బాలిక (16)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తన తల్లితో కలిసి గతనెల 30 ఛత్రినాక ఠాణాకు వచ్చి అజిత్‌కుమార్‌పై ఫిర్యాదు చేసింది. ‘చాలా రోజులుగా అజిత్ తనను వేధిస్తున్నాడని... వారం నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని’ ఫిర్యాదులో పేర్కొంది. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి ఈ నెల 1న అజిత్‌ను జైలుకు తరలించగా.. రెండు రోజుల్లోనే బెయిల్‌పై బయటికి వచ్చి దర్జాగా తిరగసాగాడు.
దీంతో బాలిక కుటుంబం తమ కూతురిపై లైంగికదాడికి పాల్పడిన యువకుడికి రెండు రోజుల్లోనే బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించడంతో పాటు తమ కూతురిపై లైంగికదాడి జరిగిందని మరోసారి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ నెల 5న బాలికను భరోసా సెంటర్‌కు తరలించారు. బాలికను పూర్తి స్థాయిలో విచారించిన భరోసా సెంటర్ సభ్యులు నివేదికను అందజేశారు. దీంతో ఛత్రినాక పోలీసులు ఆదివారం నిందితుడిపై ‘376 క్లాజ్ (1),(2), లైంగిక వేధింపుల నుంచి బాలల పరిరక్షణ చట్టం–506, నిర్భయ చట్టం, లైంగికదాడి’ కింద మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. కాగా నిందితుడి బెయిల్‌ను సోమవారం ఉదయమే రద్దు చేయించి... ఈ సెక్షన్ల కింద జైలుకు తరలిస్తామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసులో నిందితుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస్తామన్నారు.
Advertisement
Advertisement