ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన బిడ్డకు వెంటనే ఆధార్ అందివ్వనున్నారు.
అనంతపురం మెడికల్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన బిడ్డకు వెంటనే ఆధార్ అందివ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా దీనికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఆధార్ ఎలా ఇవ్వాలన్న దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఎస్‌ఓ మారుతిప్రసాద్, డిప్యూటీ ఎస్‌ఓ బసవరాజు, ఆపరేటర్ అశ్విని ఆస్పత్రికి వెళ్లి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఆర్‌ఎంఓ వైవీ రావును కలిశారు. అనంతరం వారు ఎంఆర్‌ఓ పాపారావు, స్టాటిస్టికల్ ఆఫీసర్ గౌడ్‌తో సమావేశమై ఆధార్‌పై చర్చించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన రోజే జనన ధ్రువీకరణ ఇస్తున్నారని, ఇదే సమయంలోనే ఆధార్ నమోదు ప్రక్రియ సాగాలని సూచించారు. అనంతరం ఆధార్ నమోదులో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు.