కోట్లకు పడగలెత్తిన సీఆర్డీఏ అధికారి
విశాఖపట్నం: కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) టౌన్ ప్లానింగ్ అధికారి రెహ్మాన్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులుకు దిగారు.
విశాఖలోని ఆయన ఇంటితో పాటు విజయవాడ, కర్నూలులోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 11 చోట్ల దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంతో ఏసీబీ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో భారీగా అధికారులు ఆస్తులు గుర్తించారు.
అబ్దుల్లా అనే వ్యక్తి బినామీగా రెహ్మాన్ అక్రమాస్తులు కూడబెట్టారు. అబ్దుల్లా, కుమారుడి పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవారని సమాచారం. గతంలో రెహ్మాన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్గా పని చేశాడు. ఇప్పటి వరకు రూ.1.60 కోట్లు అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. విశాఖ ఆయన నివాసంలో 4.46 లక్షలు, విదేశీ కరెన్సీ, బంగారంతో పాటు పలు జిల్లాల్లో సిరాస్థులను గుర్తించారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. అధికారులు గుర్తించిన అక్రమాస్తుల చిట్టా.
► విశాఖ దస్పల్లా హిల్స్ లేఅవుట్లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్
► రాజధాని తుళ్లూరు అనంతవరంలో 70 సెట్ల వ్యవసాయ భూమి
► గుంటూరు పొన్నూరు రోడ్డులో అపార్ట్మెంట్
► గుంటూరు, కర్నూలులో ఇల్లు.