గోదారి..మాకేది దారి? | adivasis get struggle with polavaram project | Sakshi
Sakshi News home page

గోదారి..మాకేది దారి?

Published Sun, Feb 23 2014 2:20 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

adivasis get struggle with polavaram project

కొండ కోనల మధ్య గోదావరి అండతో బతుకుతున్న ఆదివాసీల్లో ఆందోళన నెలకొంది. ముంపు పేరెత్తితేనే వారు వణికిపోతున్నారు. పోలవరం తమ పాలిట శాపం అయిందని కన్నీరుమున్నీరవుతున్నారు. కన్నతల్లిలాంటి ఉన్న ఊరును, గోడ్డూగోదను వదిలి ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. తమ బతుకులు ఛిన్నాభిన్నం చేసే ఆ పోలవరం నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు... ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఉన్నచోటును వదిలి కదిలేదే లేదని దీక్షబూనారు. గోదావరిని నమ్ముకొని ప్రకృతి ఒడిలో జీవించిన తాము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లేది లేదని తెగేసిచెబుతున్నారు. నాగరికులతో తాము వేగలేమని, తమను ఎక్కడికో పంపితే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఆ రాముడే మమ్మల్ని కాపాడాలంటూ దేవుడి మీద భారం వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలవరం ముంపు ప్రాంతాలుగా భావిస్తున్న గోదావరి తీరప్రాంతంలోని భద్రాచలం, కూనవరం, వి.ఆర్.పురం, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ఆదివాసీల ఆత్మఘోషకు దర్పణం పట్టే ‘సాక్షి’ గ్రౌండ్‌రిపోర్ట్...
 సరిహద్దులు తికమకే..
 
 రాష్ట్ర విభజనతో భద్రాచలం డివిజన్‌లోని ఎన్నో గ్రామాల సరిహద్దులు చెదిరిపోనున్నాయి. గ్రామం ఓచోట...పంటపొలాలు మరోచోట..పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంది. భద్రాచలం మండలం నుంచి వి.ఆర్.పురం వెళ్లే దారిలో గోగుబాక జంక్షన్ రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా మారనుంది. భద్రాచలం మండలంలోని బుట్టాయిగూడెం తెలంగాణ రాష్ర్టంలోకి వస్తే తోటపల్లి ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్తుంది. ఈ రెండు గ్రామాల పంటపొలాలు రెండు రాష్ట్రాల్లో ఉండనున్నాయి. బూర్గంపాడు మండలం రెండుగా చీలనుంది. కూనవరం మండలం రేపాకకాలనీని రెండు రాష్ట్రాలు పంచుకోనున్నాయి. ఇవి పోలవరం ముంపులో ఉండటంతో ప్రాజెక్టు నిర్మించేంతవరకు ఈ గ్రామాల సరిహద్దులు తికమకే.
 
 కొండరెడ్లకు తప్పని ముప్పు..
 
 నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండే కొండరెడ్లను ప్రభుత్వం కొండలు దించింది. పోలవరం ముంపు ప్రాంతంలో 12 వేలమందికి పైగా కొండరెడ్లు ఉన్నారు.  కూనవరం మండలంలోని పైడిగూడెం, కళింగమిద్ది, నల్లమామిడిగొంది, కారుమానుకొండ, పులుసుమామిడిగొంది, చింతమామిడిగొంది, ఎలుగులగొంది, గబ్బిలాలగొంది, కూటూరుగట్టు, కొప్పిరిమెట్ల గూడేల్లోని కొండలు, వేలేరుపాడు మండలంలోని కోయిద, కట్కూరు, ఎడవెల్లి గూడేల సమీపంలోని కొండల్లో కొండరెడ్లు నివాసముంటున్నారు. పునరావాసం కల్పిస్తామని ఐటీడీఏ అధికారులు కొన్ని గూడేల్లోని కొండరెడ్లను కిందకు దించారు. వీరి పునరావాసం కోసం నిధులు మంజూరుచేసినా ఆవాసం మాత్రం కల్పించలేదు. కూనవరం మండలంలోని పైడిగూడెం కొండరెడ్లే దీనికి నిదర్శనం. ఈ గూడెం సమీపంలోని కొండపై ఉన్న 12 కుటుంబాలను కిందకు దించి ఐదేళ్లయింది. వీరికోసం పైడిగూడెం తోటవద్ద ఇళ్ల నిర్మాణం చేపట్టినా ఇంకా పూర్తికాలేదు. ప్రస్తుతానికి పూరిగుడిసెలే వీరి ఆవాసం. పోలవరం ముంపుతో మళ్లీ ఎక్కడికి వెళ్లాలన్న ఆందోళన కొండరెడ్లలో నెలకొంది.
 
 శ్రీరామగిరి ‘సుందరం’ కనుమరుగే..
 
 భద్రాచలం డివిజన్‌లో అశోకరాముడు, ఆత్మారాముడు, యోగరాముడు, భోగరాముడు (భద్రాచలం), వనరాముడు ఆలయాలున్నాయి. వి.ఆర్.పురం మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో శ్రీ సుందర సీతారామచంద్రస్వామి దేవాలయంలో యోగరాముడు కొలువుదీరారు. భద్రాచలం ఆలయ నిర్మాణానికంటే ముందే శ్రీరామభక్తుడైన మాతంగి మహర్షి ఇక్కడి అడవుల్లో తపస్సు చేశారు. శ్రీరామునిపై అపారమైన భక్తితో 12వ శతాబ్దంలో గోదావరి నదీ తీరం వద్దే ఉన్న కొండపై శ్రీ సుందర సీతారామచంద్రస్వామి మూర్తులను ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణం చేశారని ప్రశస్తి. దీనివల్లే ఈ కొండ శ్రీరామగిరిగా మారిందంటారు. ఇది భద్రాచలం రామాలయం కంటే పురాతన ఆలయం. ఏటా శ్రీరామనవమిన ముత్యాల తలంబ్రాలు భద్రాచలం నుంచి ఇక్కడికి తీసుకువచ్చే సంప్రదాయం ఉంది. పోలవరం ముంపులో ఈ సుందరాలయం కూడా కనుమరుగుకానుంది. బూర్గంపాడు మండలం పెదరావిగూడెం సమీపంలోని గోదావరి నదీ తీరంవద్ద కాకతీయుల కాలంనాటి ప్రఖ్యాత కేదారేశ్వరస్వామివారి శివాలయం ఉంది. ఈ ఆలయం 2015 నాటి గోదావరి పుష్కరాలకు ముస్తాబవుతోంది. ఇది ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం కూడా ముంపులోనే ఉంది.
 
 పంట వస్తే పండగే..
 కొండరెడ్లు పంట చేతికొచ్చాక పండగ చేసిమరీ దాన్ని గుడిసెల్లోకి తీసుకొస్తారు. ఈ తెగలో ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. మామిడి పండగ, బొబ్బరి, పచ్చ, చిక్కుడుకాయ.. ఇలా ఏ పంటైనా తొలికోతను తమ ఇష్ట దైవం గజలక్ష్మికి నైవేద్యంగా సమర్పిస్తారు. పోలవరం ముంపుతో ఈ సంప్రదాయం కూడా కనుమరుగుకానుందని... పునరావాసం కల్పించే చోట పండక్కు పంటరావడం అనుమానమేనని స్థానికులు వాపోతున్నారు.
 
 ఇష్టంతో పెళ్లి..
 
 నాగరిక సమాజంలో వరకట్న దురాచారం అధికంగా ఉంది. ప్రేమవివాహాలంటే గిట్టని వారు ఎందరో ఉన్నారు.ఆదివాసీ గూడెల్లో మాత్రం ఇవేవీ లేవు. వరుసై ఒకరినొకరు ఇష్టపడితే వారిది జీవిత బంధమే. కట్నం అంటే అమంగళం అని భావి స్తారు. ఇష్టపడి పెళ్లి చేసుకుంటే గూడెమంతా బంతి పెట్టాల్సిందే. ఆదివాసీ సంప్రదాయంలో పురుషుడే కుటుంబానికి పెద్ద. తన విల్లంబుతో సుదూరంలో ఉన్న కోడిగుడ్డును ఎవరైతే కొడతారో అతనే ఊరికిమొనగాడు.ఈ సంప్రదాయం కొండరెడ్లలో అధికంగా కనిపిస్తుం ది. అనాగరికులైనా కట్నం వద్దని, ఇష్టపడితే పెళ్లిచేసి నాగరిక ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నారు.
 
 తీరమంతా క్రాప్‌బౌల్..
 భద్రాచలం డివిజన్‌లోని గోదావరి తీరమంతా సారవంతమైన నల్లరేగడి, ఎర్ర నేలలే. భద్రాచలం, కూనవరం, వి.ఆర్.పురం, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని తీరప్రాంత గూడేలు, గ్రామాల్లో ఎటుచూసినా పంటలే. పత్తి, మిర్చి, పొగాకు, మొక్కజొన్న, శనగ, జొన్న, వరి పంటలు పండిస్తూ ఆదివాసీలు, గిరిజనేతరులు జీవిస్తున్నారు. వి.ఆర్.పురం మండలంలో తీరంవెంట ఉన్న గ్రామాల్లో ఎరువులు వేయకుండానే పంటదిగుబడి అధికంగా వస్తోంది. ఈ పంటలతో తీరప్రాంతం పచ్చని తివాచీ పరిచినట్లుగా ఉండి పర్యాటకులకు కనువిందు చేస్తోంది.
 
 అటవీ ఉత్పత్తులే ఆసరా..
 
 అటవీ ఉత్పత్తులను సేకరించి సంతలో అమ్ముతారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) వీరు సేకరించిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. అడవి చింత, జిగురు, బంక, పొక్క, చిల్లగింజలు, దిష్టిగింజలు, విప్ప, తేనె, కరక్కాయ తదితర ఉత్పత్తులను అడవిలో సేకరిస్తారు. కూనవరం, వేలేరుపాడు, వి.ఆర్.పురం మండలాల్లోని చాలా ఆదివాసీ గూడేల్లో ఈ ఉత్పత్తుల ద్వారా డబ్బులు సంపాదిస్తారు. ఆ పైసలతోనే నిత్యావసర వస్తువులను సంతలో కొంటారు. ఈ అరుదైన ఉత్పత్తులు ఇకమీదట కనిపించకపోవచ్చు.
 
 బొంగు కల్లే ‘పానీయం’
 
 కూనవరం, వి.ఆర్.పురం, వేలేరుపాడు మండలాల్లో గిరిజన, ఆదివాసీల పంటపొలాల్లో తాడిచెట్లు వనంలా ఉంటాయి. పొద్దస్తమానం పనిచేసి సాయంత్రమైతే కుటుంబమంతా బొంగుకల్లు తాగాల్సిందే. తాటిచెట్లకు వెదురుబొంగులను అమర్చి కల్లు తీస్తారు. ఆరోగ్యానికి బొంగుకల్లు మంచిదని వారు నమ్ముతారు. పోలవరం ముంపులో ఈ మండలాలు ఉండటంతో బొంగుకల్లు ఆదివాసీలకు దూరం కానుంది.
 
 పాపికొండలకు బాట.. పోచవరం
 
 పాపికొండల అందాలను ఆస్వాదించాలంటే వి.ఆర్.పురం మండలం పోచవరం మీదుగా వెళ్లాలి. భద్రాచలం నుంచి ఇక్కడికి 75 కి.మీ.లు. గ్రామం పక్కనే గోదావరి తీరం, నాటు లాంచీలు, నాటు పడవలు, దేశ, విదేశీ పర్యాటకులతో ఈ గ్రామం నిత్యం కళకళలాడుతుంది. ఈ గ్రామస్తులకు పాపికొండలకు వచ్చే పర్యాటకులే ఆర్థిక వనరు. పడవలు, లాంచీల యజమానులు కొందరైతే..మరికొందరు వీటిలో పనిచేస్తూ జీవిస్తున్నారు. నిత్యం సందడిగా ఉండే ఈ గ్రామం పోలవరంతో సమాధి కానుండటంతో ఈ ప్రాంతవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పాపికొండలే కాకుండా ఈ గ్రామం నుంచి లాంచీల్లోనే కొండెపూడి, కొల్లూరు, గొండూరు, తుమ్ములేరు గూడేలకు ఆదివాసీలు రాకపోకలు సాగిస్తున్నారు. పర్యాటకుల ద్వారా వచ్చే ఆదాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. లాంచీలను నిర్వహిస్తూ కొందరు...వాటిలో పనిచేస్తూ మరికొందరు పొట్టపోసుకుంటున్నారు.
 
 శబరి..గౌతమిల సంగమం
 
 భద్రాచలం మీదు గా ప్రవహిం చే గోదావరి.. చింతూరు మీదుగా వచ్చే శబరి నదులు కూనవరం దాటిన తరువాత కలుస్తాయి. ఈ సంగమానికి ప్రతీకగా శబరిబ్రిడ్జి పక్కనే శబరిమాత విగ్రహం ఉంది. ఈ సంగమం తరువాతే గోదావరి పోటెత్తి కింద ఉన్న తీరప్రాంత గ్రామాలను ముంచుతుంది. ఈ ప్రభావం వి.ఆర్.పురం మండలంలోని పలు ఆదివాసీ గిరిజన గూడేల పై ఉంటుంది. పోలవరం ముంపు తో ఇది కొన్ని రెట్లు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. శబరిమాతను కూడా ముంపు దాచుకోనుంది.
 
 గౌతమీ తీరం రామమయం..
 
 గోదావరి తీరంలోని పలుగ్రామాలు రామాయణ గాథతో ముడిపడి ఉన్నాయి. వి.ఆర్.పురం మండలంలోని రేఖపల్లి, సీతంపేట, చొక్కనపల్లి, సోకిలేరు ముంపుప్రాంతాలు. రావణుడు సీతను ఎత్తుకెళ్తుండగా జఠాయువు అనే పక్షి రావణుడిని అడ్డుకుంది.. రావణుడు కోపాగ్నితో విసిరిన కరవాలంతో ఆ పక్షి రెక్క తెగిపడింది. ఆ ప్రాంతమే రేఖపల్లి. మరో రెక్క భద్రాచలం మండలం ఏటపాక వద్ద పడగా దానికి ఏటపాక అనే పేరు వచ్చింది. మాయారూపంలో వచ్చిన బంగారు లేడిని రాముడు చొప్పించి కొట్టాడు. దీనికి చొక్కనపల్లి అని పేరు. సీత శోకంతో నిండింది సోకిలేరు. సీత నడయాడిన ప్రాంతం సీతంపేట పురాణగాథలతో ముడిపడి ఉన్న ఈ గ్రామాలు ముంపులో కలవనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement