ఆంధ్రుల మనోభావాలు దెబ్బతీశారు
విజయవాడ(మధురానగర్) : ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా అని, అటువంటి హక్కును అధికార టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు భగ్నం చేసి తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు, ఏపీఎస్‌వైఎఫ్ నాయకులు నవనీతం సాంబశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీలు ఇవ్వాలని, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన సమాఖ్య(ఏపీఎస్‌వైఎఫ్) ఆధ్వర్యాన గురువారం చుట్టగుంటలోని బీఎస్‌ఎన్‌ఎల్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు, నవనీతం మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలు గగ్గోలు పెట్టినా సాయం, ప్యాకేజీలతో సర్దుకుపోదాం.. అంటూ చంద్రబాబు నాయుడు ఐదు కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను నీరుగార్చారని మండిపడ్డారు. రాజదాని నిర్మాణం కోసం మట్టి, నీళ్లు తెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ప్యాకేజీ పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10వ తేదీన విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఏపీఎస్‌వైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజు, నాయకులు పూజారి దుర్గారావు, తమ్మిన గణేష్, లంకా శశిరేఖ, గణేష్, కె.ఫణి పాల్గొన్నారు.