విండ్స్ ఆఫ్ క్లోస్ సావనీర్‌నుఆవిష్కరిస్తున్న కేంద్రమంత్రి తదితరులు
ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సంస్థగా మంగళగిరిలో ఎయిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా(జేపి.నడ్డా) తెలిపారు.
– రూ.1,618కోట్ల వ్యయంతో నిర్మాణం
– మై హాస్పిటల్ యాప్ ఆవిష్కరణ
తిరుచానూరు :
ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య సంస్థగా మంగళగిరిలో ఎయిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా(జేపి.నడ్డా) తెలిపారు. తిరుపతిలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్‌లో ‘ప్రజా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ పునరుత్పత్తి ఆవిష్కరణల ఆచరణలో’ అనే అంశంపై 3వ జాతీయ స్థాయి సదస్సు సోమవారం ప్రారంభమయింది. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని సదస్సును ప్రారంభించి మాట్లాడారు. రూ.1,618కోట్ల వ్యయంతో ఎయిమ్స్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, మరో రెండేళ్లల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రాణాంతకమైన, ప్రమాదకర వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు అత్యాధునిక వైద్యసేవలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించడానికి జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా వైద్య అభివృద్ధికి కేంద్రం ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాలు సమర్పించే రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడానికి ఈ సదస్సు దోహదపడుతుందని తెలిపారు. డిజిటల్ ఇండియా దేశ ప్రధాని ఆశయమని తెలిపారు. ప్రధాని ఆలోచనల మేరకు ప్రతి నెల 9వ తేదీన ప్రాథమిక వైద్య కేంద్రాలలో ప్రతి ఒక డాక్టర్ ఉంటారని, ఆ రోజంతా గర్భిణీ స్త్రీలకు ప్రసవానికి ముందు, తరువాత వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా మై హాస్పిటల్ యాప్, ఐ పోష్టర్‌ను విడుదల చేశారు.
కేంద్ర సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే మాట్లాడుతూ మాతా శిశు మరణాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 19పరీక్షలు, సామాజిక ఆరోగ్య కేంద్రంలో 40పరీక్షలు, ప్రాంతీయ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రిలలో 63పరీక్షలను రోగులకు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఏఎన్‌ఎంకు ట్యాబ్‌లను సరఫరా చేశామని, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకం ద్వారా రాష్ట్రంలో 278తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యుని సూచనల మేరకు రోగులకు ఉచితంగా మందులు ఇస్తున్నట్లు తెలిపారు. జాతీయ డయాలసిస్ కార్యక్రమాన్ని గూడూరు, శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రులలో రిమోట్ ద్వారా కేంద్రమంత్రి ప్రారంభించారు. అనంతరం వివిధ రాష్ట్రాలకు సంబంధించిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సదస్సులో కేంద్ర ఆరోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీలు సీకె.మిశ్రా, అరుణ్‌పాండే, మనోజ్‌జిలానీ, రాష్ట్ర ప్రిన్సిపల్ పూనం మాలకొండయ్య, తిరుపతి సబ్‌కలెక్టర్ హిమాంశు శుక్ల, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.