వారిని మినహా చంద్రబాబు అందర్నీ మోసం చేశారు
Published Mon, Jan 9 2017 8:20 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM
రాజంపేట టౌన్ (వైఎస్సార్): చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం హిజ్రాలను మినహా అన్ని వర్గాల ప్రజలను మోసగించారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ మద్దతుతో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న గోపాల్‌రెడ్డిని గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లను ఆకేపాటి కోరారు. స్థానిక ఆకేపాటి భవన్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు.
అమర్‌నాథ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్ల నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని నిరుద్యోగులకు నెలకు రెండువేల నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడంతో నిరుద్యోగులు ఎంతో ఆశతో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిరుద్యోగులను నట్టేట ముంచారని విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేయకుంటే వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయింటే నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడేవన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయని, ఈ ఎన్నికల్లో కూడా తమ పార్టీ మద్దతు అభ్యర్థులు గెలుపొందేందుకు చంద్రబాబు అడ్డమైన గడ్డిని తినేందుకు వెనకాడడని, విజ్ఞులైన ఓటర్లు బాబు మాటలు విని మోసపోవద్దని కోరారు.
Advertisement
Advertisement