ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల
- స్థానికంగానే సమస్యలు పరిష్కరించుకోవాలి
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- 'గండుగులపల్లి(దమ్మపేట):
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, స్థానిక సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.మంగళవారం మండల పరిధిలోని గండుగులపల్లిలోని తన నివాసంలో ఉన్న తుమ్మలను జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమపై నమ్మకంతో ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్న ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధిని వేగవంతం చేయాలన్నారు. అధికారులు ధైర్యం చేసి పనులు చేస్తే ఆ కీర్తి వారికే దక్కుతుందని, గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు ప్రస్తుతం మంచి స్థానాల్లో ఉన్నారంటే దానికి వారు చేసిన పనివిధానమే కారణమన్నారు. పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చునని, ఆ విధంగా అధికారులు పనులు చేయాలన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు విషయంలో పైరవీలకు ప్రాధాన్యతనిస్తే సహించేది లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, చల్లగుళ్ల నరసింహారావు, సత్తుపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ కట్టా అజయ్‌కుమార్, వేంసూరు సొసైటీ అధ్యక్షుడు వెల్ది జగన్‌మోహనరావు, నాయకులు దుగ్గిదేవర వెంకట్‌లాల్, కురిశెట్టి సత్తిబాబు, కాసాని నాగప్రసాద్ తదితరులున్నారు.