చేతగాక అభివృద్ధికి అడ్డు అంటారా?
చంద్రబాబు, టీడీపీ మంత్రులపై అంబటి రాంబాబు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రెండున్నరేళ్లుగా పాలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతగాక ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారంటూ అక్కసు వెళ్లగక్కుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్రకార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్, టీడీపీ మంత్రులు, నేతలంతా కలసి జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ నిత్యం భజన చేస్తున్నారని మండిపడ్డారు. తాము అభివృద్ధికి ఏమాత్రం వ్యతిరేకం కాదని, ఆ ముసుగులో చంద్రబాబు, లోకేశ్ సాగిస్తున్న అవినీతి, అన్యాయాలు, అక్రమాలనే ప్రశ్నిస్తున్నామని చెప్పారు.
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది..
భోగాపురం విమానాశ్రయం, మచిలీపట్నం నౌకాశ్రయం, మెగా ఆక్వా ఫుడ్ పార్కు, కాకినాడ దివీస్ లేబరేటరీ, రాజధాని, ఇలా ప్రతిదానికీ జగన్‌కు ముడిపెట్టి విమర్శించడమంటే ‘ఆడలేక మద్దెల ఓడు..’, అన్నట్లుగా ఉందని అంబటి విమర్శించారు. రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రజలు న్యాయస్థానాలకెళ్లి స్టేలు తెచ్చుకుంటే వారికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందన్నారు.
తరిమి కొట్టేది మిమ్మల్నే..
జగన్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారంటూ అనవసరంగా విమర్శలు కొనసాగిస్తే ప్రజలు మూతిపళ్లు రాలగొట్టడం ఖాయమని అంబటి అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు బందోబస్తు లేకుండా ప్రజల దగ్గరకు వెళితే తరిమితరిమి కొడతారని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ కులాలమధ్య చిచ్చుపెడుతోందని, తమ తండ్రీకొడుకుల మధ్య కూడా చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారని లోకేశ్ చేసిన విమర్శ అర్థం లేనిదన్నారు. ఈ రాష్ట్రంలో కులాలమధ్య, కుటుంబాలమధ్య, బంధువులమధ్య చిచ్చుపెట్టే చరిత్ర, సంస్కృతి ఏపార్టీకి, ఎవరికుందో ప్రజలందరికీ తెలుసన్నారు.
నోట్ల రద్దు లీక్ బాబుకు ఎక్కడినుంచో అందింది
పెద్ద నోట్లు రద్దవుతాయని చంద్రబాబుకు ఎక్కడినుంచో ముందుగానే ‘లీక్’అందినట్లుందని, అందుకే కొద్ది రోజులక్రితం ఆయన కేంద్రానికి లేఖలు రాశారని అంబటి అనుమానం వెలిబుచ్చారు. జగన్ వద్ద నల్లధనం ఉందంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.