
యువతపై ఉక్కుపాదమా?
♦ హోదా ఉద్యమకారులపై సర్కారు నిర్బంధం
♦ శాంతియుత ప్రదర్శనలపైనా ఆంక్షలు
► ఉద్యమాన్ని నీరుగార్చడమే లక్ష్యం
► హోదా పోరాటానికి అనుమతి లేదు: డీజీపీ
► విశాఖ దారుల్లో చెక్‌పోస్టులు, బీచ్‌లో సీసీ కెమెరాలు,
► అయినా వెనుకంజ వేసేది లేదంటున్న యువత
► ఇది ఆఖరిపోరాటం అంటూ కదులుతున్న యువతీ యువకులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, సాక్షి, అమరావతి, విశాఖపట్నం: సాగరతీరాన ఉత్తుంగ తరంగా లను ఆంక్షలతో ఎవరైనా ఆపగలరా?... జల్లికట్టు పోరాట స్ఫూర్తితో ప్రత్యేకహోదాను సాధించుకోవడం కోసం ఉరకలెత్తుతున్న యువతను అనుమతుల పేరుతో ఆపాలను కోవడం సరిగ్గా అలాంటిదే. గణతంత్ర దినో త్సవాన విశాఖ తీరంలోనూ, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలోనూ జరిగే కార్య క్రమాలలో పాల్గొనాలని, హోదా పట్ల తమ ఆకాంక్షను కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు గుర్తిం చేలా చేయాలని యువత సర్వసన్నద్ధమవు తు న్న నేపథ్యంలో వారిని ఎలాగైనాసరే అడ్డుకుని ఉద్యమాన్ని నీరుగార్చడానికి సర్కారు ప్రయత్నాలు ప్రారంభించింది. హోదా కోసం జరిగే ర్యాలీలకు అనుమతి లేదని, తరలి వచ్చేవారిని అడ్డుకుంటామని డీజీపీ నండూరి సాంబశివరావు మంగళవారం మీడియా సమావేశంలో హెచ్చరించారు.
విశాఖలో ప్రదర్శనలకు, ర్యాలీలకు ఎలాంటి అనుమతీ లేదని ఆయన స్పష్టం చేశారు. విశాఖతో పాటు విజయవాడ, తిరుపతి కార్యక్రమాల కూ అనుమతి లేదని డీజీపీ ప్రకటించారు. అనుమతుల్లేని ర్యాలీలు, ప్రదర్శనలలో పా ల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుం టామ ని, కేసులు పెడతామని విశాఖ కలెక్టర్, పోలీ సు కమిషనర్ హెచ్చరించారు. అన వసరంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని విద్యార్థుల కు హితవు పలికారు. అవసరమైతే హౌస్ అరెస్టులు చేస్తామని, విశాఖ బీచ్‌లో సీసీ కెమెరాలు పెట్టామని వారు పేర్కొన్నారు. అయితే ఎంతటి నిర్బంధం ఎదురైనా వెను కంజ వేసే ప్రసక్తిలేదని, ప్రత్యేక హోదా ఉద్య మాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ముందుకే తీసుకు పోతామని యువత స్పష్టం చేస్తోంది. హోదా కోసం జరిగే అన్ని కార్యక్రమాలకు సంఘీభా వం ప్రకటించాలని, హోదా ఆకాంక్షను వెల్లడి స్తూ 26న కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనాల ని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునివ్వడం యువతలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.
హోదాపై ఇంత నిర్బంధమా..?
ఐదున్నర కోట్ల మంది ప్రజల ఏకైక ఆకాంక్ష ప్రత్యేక హోదాపై ఈ స్థాయిలో నిర్బంధం ప్రయోగించడం చూసి రాష్ట్రప్రజలు విస్తుపో తున్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున డీజీపీ ఇలా ప్రకటించారంటే అది ముఖ్యమంత్రి మాటగానే భావించాల్సి ఉంటుందని చర్చించుకుంటున్నారు. ప్రజల ఆకాంక్ష కోసం తాను ముందుండి కేంద్రంపై పోరాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా ఉద్యమాన్ని నిర్బంధం ప్రయోగించి నీరుగార్చేందుకు ప్రయత్నిస్తుం డడం విచారకరమని వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుప్రజల ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ.. తెలుగుప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా మారిన ప్రత్యేకహోదాను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
అనుమతిలేని నిరసనలు, ర్యాలీలలో పాల్గొనే వారిని అరెస్టు చేస్తామని, జైళ్లలో నిర్బంధిస్తా మని పోలీసులు అంటున్నారు. డీజీపీ వ్యాఖ్య లతో రాష్ట్రంలోని 13 జిల్లాల పోలీసు అధికా రులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ జరపతలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీలను భగ్నం చేయడానికి వ్యూహాలు రచించడం ప్రారంభించినట్లు పోలీసు వర్గాల లో వినిపిస్తోంది. ముఖ్యనేతల గృహనిర్బంధా లతో ఉద్యమాన్ని నీరుగార్చాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిం చడంపైనా ఆంక్షలు విధిస్తుండడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో వైపు జిల్లాల్లో ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో చురుకుగా వ్యవహరిస్తున్న యువతీయువకుల సమాచారంపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు వినిపిస్తోంది.
ఏది ఏమైనా ముందుకే..
రాష్ట్రానికి అపర సంజీవని అయిన ప్రత్యేక హోదాను ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ సాధించుకో లేమన్న అభిప్రాయం యువతలో గట్టిగా నెలకొంది. రెండున్నరేళ్లుగా ఎదురు చూసిన యువత ఇటు ఉద్యోగాలు లేక, అటు పరిశ్రమలు రాక తీవ్ర నిరాశలో కూరుకుపో యింది. దీనికి ప్రత్యేక హోదా ఒక్కటే పరిష్కారం అన్న అభిప్రాయానికి వచ్చారు. పొరుగున ఉన్న తమిళనాడులో సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం రాష్ట్రమంతా ఒక్కతాటి పైకి రాగలిగినప్పుడు ఐదున్నరకోట్ల మంది ప్రజల జీవన్మరణ సమస్యగా ఉన్న ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకోలేమా అని ప్రశ్నతో యువత రగిలిపోతోంది.
అందుకే ఎంతటి నిర్బంధం ఎదురైనా వెనుకంజ వేసేది లేదని యువతీయువకులు స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చెబుతున్నారు. గణతంత్ర దినోత్సవం రోజున జిల్లాకేం ద్రాలకు చేరుకునేందుకు అన్ని జిల్లాల్లోనూ యువతీయువకులు సన్నద్ధమౌతున్నారు. అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్టీల కతీతంగా జరుగుతున్న ఈ పోరాటం లో అందరూ ఒక్కతాటిపై నిలవాలని, హోదా సాధించేవరకు పట్టుదలగా పోరాడాలని సామాజిక మాధ్యమాలలో ఒకరికొకరు సందే శాలు పంపించుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యేకహోదాకు సంబంధించిన పోస్టులు, చర్చలే ఉంటున్నాయి. వ్యక్తిగత ప్రొఫైల్స్‌కు సంబంధించిన డిస్‌ప్లే పిక్చర్‌లన్నీ ప్రత్యేక హోదా డిమాండ్‌తో కూడిన పిక్‌లుగా మారిపోయాయి.
ర్యాలీలను అనుమతించం..: డీజీపీ
‘‘ప్రత్యేక హోదా కోసం ఈ నెల 26న విశాఖ బీచ్ కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోను అనుమ తించం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’అని డీజీపీ నండూరి సాంబశివరరావు ప్రకటించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంగళ వారం ఆయన మీడియా సమావేశం నిర్వహిం చారు. జల్లికట్టును ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం విశాఖ బీచ్‌లో యువత నిరసన తెలపాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న మెస్సేజ్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియలేదన్నారు.
ఎవరు నాయకత్వం వహిస్తున్నారో తెలియని ఇటువంటి కార్యక్రమాలతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పారు. పెద్ద కార్యక్రమాలు చేపట్టినప్పుడు నిర్వాహకులు ఎవరన్నది చూసి అనుమతి ఇస్తామని చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వీఐపీలు పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి నిరసనలు, ఆందోళనలు వంటి సోషల్ మీడియా పిలుపులకు, ట్వీట్లకు స్పందించి యువత పాల్గొనవద్దని కోరారు. విశాఖ బీచ్‌లోనే కాదు సోషల్ మీడియాలో పిలుపునిచ్చినట్టు విజయ వాడ, తిరుపతిలో ర్యాలీలకు అనుమతిలేదని, నిరసనలు జరుగుతాయనుకున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులోకి తెస్తామని, కాదని వస్తే అడ్డుకుంటామని డీజీపీ చెప్పారు.
26న కార్యక్రమాలకు అనుమతి లేదు: విశాఖ కలెక్టర్, కమిషనర్
విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ నెల 26న యువత తలపెట్టిన మౌన ప్రదర్శన. నిరసన కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌లు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మి యువత ఈ ప్రదర్శనల్లో పాల్గొని తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవుపలికారు. ప్రత్యేక హోదా ఉద్యమ నేపథ్యంలో అప్రమత్త మైన జిల్లా యంత్రాంగం మంగళవారం సమీక్షించింది.
అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్, సీపీలు మీడియాతో మాట్లాడారు. ’జనవరి 26న రిపబ్లిక్ డే.. 27, 28 తేదీల్లో విశాఖలో భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో ప్రదర్శనలు..ర్యాలీలు చేయడం తగదని కలెక్టర్, సీపీలు పేర్కొన్నారు. ఎలాంటి అనుమతుల్లేని ర్యాలీలు, ప్రదర్శనల్లో పాల్గొంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. కేసులు నమోదు చేస్తాం.. అనవసరంగా భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సీపీ హెచ్చరించారు ర్యాలీ చేయడానికి సిద్ధమైతే హౌస్ అరెస్ట్‌లు సైతం చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. ఇందుకోసం ఆర్కేబీచ్‌లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలు, పోలీస్ చెక్‌పోస్టులు, పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.