అంగన్‌వాడీల నుంచి అక్రమ వసూళ్లు
అంగర (కపిలేశ్వరపురం) : అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ఐసీడీఎస్ అధికారులు అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నారని, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నిలుపుదల చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి డిమాండ్ చేశారు. మండలంలోని అంగరలో బుధవారం నిర్వహించిన కపిలేశ్వరపురం ప్రాజెక్టు స్థాయి సమావేశంలో కపిలేశ్వరపురం, మండపేట, ఆలమూరు, కె.గంగవరం మండలాల కార్యకర్తలు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి, సెక్టారు నాయకుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో బేబీరాణి మాట్లాడుతూ కేంద్రాలపై అధికార పార్టీ నాయకుల వేధింపులు అధికమయ్యాయన్నారు. ఇదే అదనుగా సీడీపీఓ నుంచి సూపర్‌వైజర్ల స్థాయి అధికారులు కేంద్రాల సందర్శనలకు వచ్చి అక్రమ వసూళ్లుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిర్వహణ భారంగా మారిన నేపథ్యంలో అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యపై రానున్న రోజుల్లో జిల్లా స్థాయి ఉద్యమానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. కె.కృష్ణవేణి, ప్రాజెక్టు కార్యదర్శి ఆర్.సుబ్బలక్ష్మి, ఎం.బేబి, జి.విజయలక్ష్మి, ఆర్.రాణి, కేఎమ్మార్ సులోచన, జగదీశ్వరి, ఇందిర, ఝాన్సీ, వెంకటరత్నం, వీరలక్ష్మి, ద్రౌపతి మాట్లాడుతూ 12 నెలలు పాటు బిల్లులు బకాయిపడి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.