
‘నారాయణ’లో మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
నారాయణ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఆదిభట్ల(రంగారెడ్డి): నారాయణ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరుగేటు సమీపంలోని నారాయణ ఐఐటీ స్పార్క్ అకాడమీ వద్ద ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. వరంగల్ జిల్లాకు చెందిన పవన్ నాయక్(17) ఈ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇది గుర్తించిన తోటి విద్యార్థులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ పరిస్థితి నిలకడగానే ఉందని.. కానీ రెండు కాళ్లు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు. కాగా.. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి కళాశాల యాజమాన్యానిదే బాధ్యత అని పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కళాశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు కళశాల ముందు ఆందోళనకు దిగారు.