
ఇప్పటికే చాలా చెడ్డపేరు వచ్చింది!
చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇరుక్కుంటారు.
* కాల్‌మనీ కేసును డైవర్ట్ చేద్దాం.. వైఎస్సార్‌సీపీపై ఎదురుదాడి చేద్దాం
* అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఏపీ సీఎం ఉద్బోధ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇరుక్కుంటారు. ఇప్పటికే చాలా చెడ్డపేరు వచ్చింది. నగరంలో మహిళలపై అత్యాచారాలు, వ్యభిచార కూపంలోకి లాగడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాల్‌మనీలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయ్. ఏమిటిది..’ అంటూ మంత్రివర్గ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు విశ్వసనీయ సమాచారం.
‘కాల్‌మనీ-సెక్స్ రాకెట్ కేసును డైవర్ట్ చేద్దాం. ఈ 2 రోజుల్లో దొరికిన వారిలో మనవారిని వదిలేయండి. తటస్థంగా ఉండేవారిని వైఎస్సార్‌సీపీవారిగా చెప్పండి. గురువారం జరిగే అసెంబ్లీ సమావేశంలో విపక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలి. వారిని మాట్లాడనివ్వకుండా అంకెలు చెప్పండి. వైఎస్సార్‌సీపీవారే కాల్‌మనీ నేరస్తులని ప్రజలు నమ్మాలి...’ ఇదీ బుధవారం మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు చేసిన ఉద్బోధ. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఈ అంశంపై సభను స్తంభింపచేయాలని వెల్ లేదా పోడియం వద్దకు పోతే పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంతమందికి అవకాశం వస్తే అంతమందీ విమర్శలు చేయాలని చెప్పారు. మనం కీలక పదవుల్లో ఉన్నాం కాబట్టి చాలామంది వచ్చి ఫొటోలు దిగుతుంటారని, అలా దిగినవారు ఏదో తప్పు చేస్తే మనతో సంబంధం ఉన్నట్లుగా ప్రచారం చేయటం సరికాదని చెప్పారు.