
భారీ దోపిడీకి కేబినెట్ సై!
సాక్షాత్తు ఒక మాజీ సీఎస్, ప్రస్తుత సీఎస్ కూడా వద్దని చెప్పిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదముద్ర వేసేసింది. నీటి ప్రాజెక్టుల భారీ దోపిడీకి రంగం సిద్ధమైపోయింది. హంద్రీ- నీవా, గాలేరు -నగరి ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేస్తామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆర్థికశాఖ సైతం అభ్యంతరం తెలిపిన ఈ ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కలిసి ఆమోదముద్ర వేయించారు.
మొత్తం రూ. 13,475 కోట్ల అదనపు చెల్లింపులకు సర్వం సిద్ధమైపోయింది. అంతకు ముందున్న అంచనాలను రూ. 24,705 కోట్లకు పెంచారు. దీనికి పాత సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రస్తుత సీఎస్ ఠక్కర్ కూడా విముఖత చూపి, సంబంధిత ఫైళ్లను వెనక్కి తిప్పి పంపారు. అయినా కూడా, గతంలో ఎన్నడూ లేని రీతిలో మూడుసార్లు ఈ అంశంపై చర్చ జరిపి.. చివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.