జగన్ పర్యటనతో ప్రభుత్వంలో చలనం
• గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పీవో
• మరుగుదొడ్ల సత్వర మరమ్మతులకు ఆదేశం
• సమస్యల పరిష్కారం దిశగా కదిలిన అధికారులు
రంపచోడవరం : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. రంపచోడవరం గిరిజన గురుకుల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు తీరనున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో జగన్ తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో పర్యటించిన విషయం తెలిసిందే. మొదటి రోజు రంపచోడవరంలో పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి జరిపాక మారేడుమిల్లి వెళుతుండగా.. రంపచోడవరం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఆయన కాన్వాయ్‌ని ఆపారు. సరైన భోజనం, హాస్టల్‌లో కనీస మౌలిక వసతులు లేక తాము పడుతున్న ఇబ్బందులను చూడాలని కోరారు.
విద్యార్థుల విజ్ఞప్తిని మన్నించిన జగన్.. గురుకుల పాఠశాలను స్వయంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఐటీడీఏ పీవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏఎస్ దినేష్‌కుమార్ గురుకుల పాఠశాలను ఆదివారం సందర్శించారు. మరుగుదొడ్లను పరిశీలించారు. వాటి మరమ్మతులకు తక్షణం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమస్యను ఇప్పటివరకూ పట్టించుకోలేదేమంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మితోనూ చర్చించారు.