వరించేదెవరినో..! | Appointment of TDP Presidents in two districts | Sakshi
Sakshi News home page

వరించేదెవరినో..!

Published Sat, Sep 2 2017 12:19 PM | Last Updated on Fri, Aug 10 2018 8:27 PM

వరించేదెవరినో..! - Sakshi

వరించేదెవరినో..!

రెండు జిల్లాల టీడీపీ అధ్యక్షుల నియామకంపై ఉత్కంఠ
పార్టీ పదవులపై తొలగని ప్రతిష్టంభన
పోటీలో పలువురు నాయకులు
ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నం


సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండు జిల్లాల టీడీపీ అధ్యక్షుల నియామకం విషయంలో కొంత ఉత్కంఠ నెలకొంది.  ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న నేతలు జిల్లా విడిపోయిన తర్వాత పార్టీ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతకాలంగా రెండు జిల్లాలకు విడివిడిగా కమిటీలు వేస్తారని ప్రచారం జరగడంతో ఆయా జిల్లాల నాయకులు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక జిల్లాలో టీడీపీ ప్రభ తీవ్రస్థాయిలో తగ్గిపోవడంతోపాటు అనేక మంది ముఖ్య నేతలు అధికార పార్టీలోకి వలస వెళ్లారు. దీంతో జిల్లాలో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురైంది.

గత శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒకే ఒక్క సత్తుపల్లి స్థానాన్ని గెలుపొందిన ఆ పార్టీ.. ఆ తర్వాత ఖమ్మంలో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క స్థానాన్ని సైతం గెలుచుకోలేకపోయింది. జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టీడీపీ ఇప్పుడు తన ఉనికి చాటుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా విడిపోయి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలుగా ఏర్పడింది. ఈ క్రమంలో వామపక్ష పార్టీలతో సహా అనేక రాజకీయ పక్షాలు కొత్త జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి.

అయితే టీడీపీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు నూతన కమిటీల ఏర్పాటుకు కొంతకాలంగా కసరత్తు చేస్తున్నా.. ఆయా జిల్లాల అధ్యక్ష పదవులపై ఏకాభిప్రాయం కొరవడటం, అనేక మంది ఈ పదవి కోసం పట్టుపడుతుండటంతో ఈ నియామకాన్ని చేపట్టకుండా అధిష్టానం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోందన్న ప్రచారం పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది.

చర్చోపచర్చలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురానికి చెందిన తుళ్లూరి బ్రహ్మయ్య కొనసాగుతుండగా.. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై పార్టీలో చర్చోపచర్చలు జరిగినా ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న తుళ్లూరి బ్రహ్మయ్యనే మరోసారి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించాలని పార్టీలోని కొందరు ముఖ్య నేతలు టీడీపీ అధిష్టానానికి సిఫార్సు చేయగా.. మరికొందరు మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రస్థాయిలో వ్యతిరేకించి.. ప్రస్తుత ఖమ్మం జిల్లాకు చెందిన సమర్థుడైన నాయకుడికి ఖమ్మం జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చింది.

అలాగే ఆది నుంచి పార్టీలో కొనసాగుతూ.. విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవాలయం పాలకవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న పార్టీ సీనియర్‌ నేత, మధిరకు చెందిన వాసిరెడ్డి రామనాథం పేరును జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు ప్రతిపాదించారు. ఆయనతోపాటు పార్టీ మహిళా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, ఏలూరి శ్రీనివాసరావు సైతం ఈ పదవిని ఆశిస్తున్నారు. దీంతో వీరిలో ఎవరి పేరు ఖరారు చేయాలో ఒక పట్టాన తేల్చుకోలేక.. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల అధ్యక్షుల ఎంపికను పూర్తి చేసిన టీడీపీ అధిష్టానం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షుల ఎంపికను మాత్రం వాయిదా వేసింది. వాసిరెడ్డి రామనాథంకు పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా లేని పక్షంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీలోని మరికొందరు ముఖ్యులు అధిష్టానాన్ని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం హోరాహోరీగా పోరు సాగుతోంది.

పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి కోనేరు సత్యనారాయణ(చిన్ని) తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తుండగా.. పినపాక నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత కొల్లేటి భవానీ శంకర్‌ అదేస్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. అయితే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అధ్యక్షుల ఎంపిక వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా పరిణమించిందనే భావన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. టీడీపీ పరిస్థితి జిల్లాలో కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది. పార్టీ జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయడంపై పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్నిబట్టి తమ రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించుకునేందుకు అనేక మంది సీనియర్‌ నేతలు సమాయత్తం అవుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే టీడీపీ ఉభయ జిల్లాల్లోనూ మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement