రెయిన్ ఇండస్ట్రీస్‌లో అసైన్డ్ భూములు
Published Fri, Feb 3 2017 12:10 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM
– 15 నుంచి 20 ఎకరాలలను గతంలోనే కొనుగోలు చేసిన యాజమాన్యం
– యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ నోటీసులు
కర్నూలు(అగ్రికల్చర్): అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ఫ్యాక్టరీ స్థలంలో కలిపేసుకున్న రెయిన్ ఇండస్ట్రీస్ సిమెంట్ కంపెనీ యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నోటీసులు జారీ చేశారు. దాదాపు 10 రోజుల క్రితమే నోటీసులు జారీ కాగా.. వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివిధ సర్వే నెంబర్లలోని 15 నుంచి 20 ఎకరాల అసైన్డ్ భూములను కలిపేసుకున్నందుకు మీపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని జిల్లా కలెక్టర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్యాపిలి తహసీల్దారు ద్వారా ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు పంపినట్లు సమాచారం. ప్యాపిలి మండలం రాచర్ల రెవెన్యూ గ్రామం పరిధిలో దాదాపు 20 ఏళ్ల క్రితం ఎన్‌సీసీ సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటయింది. ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీని రెయిన్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఆధీనంలోకి వచ్చింది. రాచర్ల రెవెన్యూ గ్రామం పరిధిలోని బోయిన్‌చెర్వుపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు 50, 54, 116, 287తో పాటు మరిన్ని సర్వే నెంబర్లలోని అసైన్డ్ భూములను యాజమాన్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
వీటిని కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. అయితే సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యం ఽఅసైన్డ్ భూములను ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందే కొనుగోలు చేసినట్లు సమాచారం. వీటి విలువ ప్రస్తుతం రూ.2కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. తమ ఫ్యాక్టరీలో అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన యాజమాన్యం మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లిస్తాం.. ప్రభుత్వ భూములను స్వాధీనం చేయండంటూ(అలెనేషన్) ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై జిల్లా కలెక్టర్‌ను నివేదిక కోరినట్లు సమాచారం. దీనిని కలెక్టర్ లోతుగా విచారించగా అసైన్డ్ భూములని స్పష్టమైంది. ఆ మేరకు నోటీసులు జారీ చేశారు.
Advertisement
Advertisement