టీడీపీ యువనేతకు నమ్మినబంటు ఝలక్
► రూ.కోటి పాతనోట్లతో పరారీ
► సొంత టీమ్‌తో అన్వేషించి పట్టుకున్న నేత
► డబ్బు రాబట్టేందుకు పోలీస్‌స్టేషన్లో థర్డ్ డిగ్రీ!
► విషయం బయటకు రాకుండా పోలీసులకు ముందస్తు ఆదేశాలు
అక్రమ వసూళ్ల కోసం గుమస్తా ఏర్పాటు...
పల్నాడు ప్రాంతంలోని నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వ్యాపారులు, కాంట్రాక్టర్లు, అధికారులు, రేషన్, మద్యం మాఫియాలతో పాటు అన్ని రకాల వ్యాపార వర్గాల నుంచి అన్నీతానై అక్రమ వసూళ్ళు చేసేందుకు యువనేత ప్రత్యేకంగా ఒక గుమస్తాను ఏర్పాటుచేసుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత యువనేత ఆదేశాలతో ఆర్థిక లావాదేవీల పనులను సదరు గుమాస్తా చక్కబెడుతున్నాడు. ఇటీవల యువనేత వద్ద ఉన్న కోట్ల రూపాయల్లో రద్దయిన పాతనోట్లు ఉన్నాయి. వాటిని మార్చుకునే ప్రక్రియ గత 20 రోజులుగా నిర్వహించి దాదాపు 90 శాతం మార్చేశారు. నగదు మార్పిడిలో పరారైన నమ్మినబంటు (గుమాస్తా) కీలక పాత్ర పోషించాడు.
సాక్షి, గుంటూరు :
అక్రమ వసూళ్లతో కోట్లకు పడగెత్తిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత కుమారుడికి అతనికి నమ్మకస్తుడైన గుమాస్తా ఝలక్ ఇచ్చాడు. తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు యువనేత కానీ, ముఖ్య నేత కానీ మొక్కుబడిగా అయినా పట్టించుకోలేదనే కారణంతో డబ్బంటే అమితంగా ఇష్టపడే సదరు యువనేతను డబ్బుతోనే కొట్టాడు. రూ.కోటి విలువైన రద్దయిన పాత నోట్లతో ఉడాయించాడు. ఈ ఘటన పల్నాడు ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు పోలీసు అధికారుల ప్రత్యేక ఆదేశాలు కేసు లేకుండా తన సొంత టీమ్‌తో పాటు కొందరు పోలీసులను కూడా రంగంలోకి దింపి గాలింపు చేపట్టి గుమాస్తాను పట్టుకున్న యువనేత డబ్బు రాబట్టుకునేందుకు థర్డ్ డీగ్రీ మొదలుపెట్టారు. అతనితో పాటు గుమాస్తాకు సన్నిహితంగా ఉండే ఇద్దరు టీడీపీ చోటీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
లెక్కల్లో తేడాతో బహిర్గతం...
మూడు రోజుల క్రితం రెండు నియోజకవర్గాలకు సంబంధించి చేసిన వసూళ్ళు ఇద్దరూ లెక్కతేల్చగా కొంత వ్యత్యాసం వచ్చినట్లు తెలిసింది. దీంతో యువనేత గుమాస్తాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసి తేడా వచ్చిన మొత్తాన్ని తనకు చెల్లించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో గుమాస్తా తనకు ప్రాణహాని ఉందని భావించి గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్ళాడు. సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉండటంతో ఆందోâýæన చెందిన యువనేత తన మందీ మార్బలంతో గాలింపు చేపట్టాడు. చివరకు గుంటూరులో తలదాచుకున్నట్లు తెలుసుకున్న యువనేత అతనిని పట్టుకొచ్చి తన షోరూమ్‌లో బంధించినట్లు తెలియవచ్చింది. అక్కడ చితకబాదిన అనంతరం రాజుపాలెం పొలీసుస్టేన్లో అప్పగించినట్లు సమాచారం. దీంతో అతనిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలియవచ్చింది.
యువనేత అక్రమాల చిట్టా గుమాస్తా చేతిలో....
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంట్రాక్టర్లు, వ్యాపారులను బెదిరించి అక్రమంగా వసూళ్ళు చేస్తున్న వివరాలు అన్నీ గుమాస్తా వద్ద ఉన్నట్లు సమాచారం. అంతేగాక ప్రతి నెలా అధికారులు, రేషన్, మద్యం మాఫియా ఇచ్చే మామూళ్ళు సైతం గుమాస్తానే వసూలు చేస్తుంటాడు. సభ్యత్వ నమోదులో అక్రమాలు, నల్లధనం వివరాలు, అక్రమ ఆస్తుల వివరాలపై ఆ గుమాస్తాకు పూర్తిగా అవగాహన ఉంది. దీంతో అతను బయట నోరు విప్పితే తన బండారం మొత్తం బయటపడుతుందని యువనేత కంగారు పడుతున్నట్లు తెలిసింది. తన అరాచకాలు బయటకు రాకుండా గుమాస్తాను ఏమైనా చేస్తాడేమోనన్న అనుమానాలు అతని కుటుంబ సభ్యుల నుంచి వ్యక్తమౌతున్నాయి.
రెండు నియోజకవర్గాల్లో చర్చ
యువనేతకు నగదుతో గుమస్తా ఉడాయించిన వైనం రెండు నియోజకవర్గాల్లోని పారీ వర్గీయులు, సన్నిహితుల మధ్య చర్చ సాగుతోంది. ఎంత మొత్తంలో తీసుకెళ్ళాడనే దానిపై రకరకాలుగా గుసగుసలాడుకుంటున్నారు. ఎత్తుకెళ్ళింది బ్లాక్ మనీ కాబట్టి ఫిర్యాదుచేసేందుకు యువనేత వెనకడుగు వేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.