కాటేదాన్ ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు దోచుకునేందుకు ఓ యువకుడు విఫలయత్నం చేశాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వర్షానికి రోడ్డుపై ఎవరు లేకపోవడంతో యువకుడు దాదాపు 32 నిమిషాల పాటు ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. పైక్యాబిన్‌ను మాత్రమే తొలగించాడు.
మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ సుధీర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... కాటేదాన్ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం సెంటర్‌కు ఎలాంటి సెక్యూరిటి గార్డును ఏర్పాటు చేయలేదు. కేవలం సీసీ కెమెరాను మాత్రమే ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో 20-25 సంవత్సరాల వయస్సు గల ఓ యువకుడు ఏటీఎం సెంటర్‌లోకి వచ్చాడు.
ఏటీఎం క్యాబిన్‌ను గట్టిగా లాగడంతో తెరుచుకుంది. ఇందులో ఏటీఎం సెంటర్‌కు చెందిన ఏసీ రిమోట్ కంట్రోల్, ఏటీఎంలో స్లిప్‌ల కోసం ఏర్పాటు చేసే కాగితపు బండిల్‌లను స్టోర్‌గా దీనిని వాడుకుంటారు. ఇందులో డబ్బు ఏమైనా దోరుకుంతుందేమో అని నిందితుడు చూశాడు. కానీ ఏమీ దొరకకపోవడంతో తనతో తెచ్చుకున్న స్కూడ్రై వర్‌తో ఇతర భాగాలను తొలగించేందుకు ప్రయత్నించాడు. దాదాపు 32 నిమిషాల పాటు నిందితుడు ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. భారీ వర్షం కురుస్తుండడంతో ఈ సమయంలో రోడ్డుపై ఎవరు లేకపోవడం, ఏటిఎంకు ఎవరు రాకపోవడంతో విషయం తెలియలేదు.
ప్రతి రోజు రాత్రి సమయాలలో పెట్రోలింగ్ పోలీసులు ఏటీఎం సెంటర్‌లను పరిశీలిస్తుంటారు. 3 గంటల ప్రాంతంలో కానిస్ట్టేబుల్ ఏటీఎం సెంటర్ వద్దకు వచ్చి పరిశీలించగా క్యాబిన్ తెరిచి ఉంది. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉదయం పోలీసులు ఫింగర్‌ప్రింట్స్‌ను సేకరించారు. అలాగే బ్యాంక్ సిబ్బందికి సమాచారం అందించి వీడియోను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.