
ఇక డిజిటల్.. మున్సిపల్
► ఒకే చోట అన్ని పౌరసేవలు
► ఆన్‌లైన్ ద్వారానే బల్దియా పనులు
► నిర్మల్‌లో పేపర్‌లెస్ ఈ–ఆఫీస్
► ఈనెల 4నుంచి ప్రారంభానికి ఏర్పాట్లు
నిర్మల్‌రూరల్: ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఏ దేశంలో మాట్లాడినా.. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా గురించే చెబుతున్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలను అందించేందుకు అన్ని కార్యాలయాలు, పనులు ఆన్‌లైన్ ద్వారానే జరగాలని, ఇందుకు ఈ–ఆఫీసులుగా మారాలని పేర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఈ–ఆఫీసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెబుతూనే ఉన్నారు. ఈక్రమంలో నిర్మల్ మున్సిపల్ డిజిటల్ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమైంది. బల్దియాకు సంబంధించిన పౌరసేవలన్నింటినీ ఒకేచోట ఆన్‌లైన్ విధానం ద్వారా అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
సత్వర సేవలు..
బల్దియా అందించే పదుల సంఖ్యలో సేవలను ఒకే చోట అందించే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మున్సిపల్‌లో చాలా సమస్యలు రోజులు, నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న సందర్భాలుంటాయి. చాలామంది బల్దియా చుట్టూ తిరిగి వేసారిపోయిన వాళ్లూ ఉంటారు. ఇక ఇలాంటి సమస్యలకూ పౌర సేవాకేంద్రం పరిష్కారం అందించనుంది. ఈ కేంద్రం ద్వారా మున్సిపల్‌కు సంబంధించిన అన్నిసేవలూ సత్వరమే పొందవచ్చు. ప్రజలు పెట్టుకున్న దరఖాస్తుకు సంబంధించిన రసీదులను సిబ్బంది ఇస్తారు. పని ఎప్పుడు పూర్తవుతుందో.. తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెండింగ్ ఫైళ్లు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది క్లియర్ చేసేందుకూ ఈ సేవా కేంద్రం ఉపయోగపడనుంది.
ప్రారంభానికి సిద్ధంగా..
నిర్మల్ మున్సిపల్‌లోకి అడుగుపెట్టగానే మొదటి గదిలో సిటిజన్ సర్వీస్ సెంటర్ (పౌర సేవాకేంద్రం)ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ గదిని సర్వాంగ సుందరంగా రంగులు, హంగులతో ముస్తాబు చేశారు. ఇక్కడ అందించే సేవలకు సంబంధించిన ఫ్లెక్సీ బోర్డులనూ ఏర్పాటు చేశారు. మున్సిపల్‌కు సంబంధించి 14రకాల సేవలను అందించనున్నట్లు ఫ్లెక్సీలనూ ఏర్పాటు చేశారు. ఇటీవల కంప్యూటర్ సిస్టంలను పెట్టి పరీక్షించారు. గతంలో ఈ గదిలో కొనసాగిన నల్లా బిల్లుల కలెక్షన్ కౌంటర్‌ను లోపలి గదిలోకి మార్చారు. మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, కమిషనర్ త్రియంబకేశ్వర్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టి పౌరసేవా కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేయించారు.
పేపర్‌లెస్ ఈ–ఆఫీస్‌గా..
దరఖాస్తులు, రసీదులు, వినతిపత్రాలు.. ఇలా అన్నింటికీ పేపర్ అవసరమే. వీటితో కార్యాలయాలు నిండిపోతున్నాయి. ఫైళ్లకు ఫైళ్లు జమ అవుతున్నాయి. ఏళ్లుగా వీటిని కాపాడలేక ఆఫీ స్ సిబ్బందీ ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ఫైళ్లు చెదలు పడుతున్నాయి. పౌర సేవాకేంద్రం ప్రారంభమైతే ఇలాంటి సమస్యలూ ఉండవు. ఆన్‌లైన్ విధానంలో ప్రారంభించే ఈ కేంద్రం ఈ–ఆఫీస్‌గా సేవలందించనుందని అధికారులు పేర్కొన్నారు. పేపర్‌లెస్ ఈ–ఆఫీస్‌గా మున్సిపల్‌ను చేయనున్నట్లు చైర్మన్ గణేశ్ చక్రవర్తి, కమిషన్ త్రియంబకేశ్వర్‌రావు చెప్పారు. ఇందుకు ప్రజలూ సహకరించాలని కోరారు.
సెక్షన్లు తిరగాల్సిన పనిలేకుండా..
‘సార్ బర్త్ సర్టిఫికెట్ ఎక్కడిస్తరు.. పింఛన్లకు యాడ దరఖాస్తు చేసుకోవాలె.. ఇల్లు కట్టాలంటే ఓళ్ల పర్మిషిన్ దీస్కోవాలా సార్..’ ఇలా నిత్యం ఎంతోమంది మున్సిపల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. పట్టణాల్లో ఎన్నో రకాల పనులను తీర్చే గుండెకాయ మున్సిపల్. దాదాపు అన్నిరకాల పనులనూ చేసేది బల్దియానే. ప్రతీరోజు ఏదో ఒక పనిపై వందలమంది మున్సిపల్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అందులో చాలామందికి ఏ పని.. ఏ సెక్షన్‌లో చేస్తారో తెలియదు. అక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలో అవగాహన ఉండదు. దీంతో వాళ్లను వీళ్లను అడగాల్సి వస్తుంది. ఇలాంటి కష్టాలకు ఇక చెక్ పడనుంది. సెక్షన్ల చుట్టూ తిరగాల్సిన అవసరమూ ఉండదు. మున్సిపల్ చేసే అన్ని సేవలనూ ఒకే గదిలోకి చేరుస్తున్నారు. పౌరసేవా కేంద్రం పేరిట ఏర్పాటు చేసిన ఈ గదిలో ఆన్‌లైన్ ద్వారా వేగవంతంగా సేవలను అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పట్టణ ప్రజల సౌకర్యార్థం
నిర్మల్ పట్టణ ప్రజలకు మున్సిపల్ తరఫున సత్వర, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ ఉన్నతాధికారులు సూచిస్తున్న పథకాలను బల్దియాలో వేగవంతంగా అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మరిన్ని సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం.
– అప్పాల గణేశ్ చక్రవర్తి, మున్సిపల్ చైర్మన్, నిర్మల్
ప్రారంభానికి సిద్ధం
మున్సిపల్ కార్యాలయంలో ఈ–ఆఫీస్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తిచేశాం. వీలైతే అవతరణ దినోత్సవం రోజున లేదంటే ఈనెల 4న పౌరసే వా కేంద్రాన్ని ప్రారంభిస్తాం. పురపాలక సేవలన్నీ సిటీజన్ సర్వీస్ సెంటర్‌లోనే పొందవచ్చు. కాగిత రహిత సేవలను సత్వరమే అందించేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం.
– త్రియంబకేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్, నిర్మల్