
మీరు ఏం తెచ్చారు.. ఏం చేశారు?
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ తానే దిక్కంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండించింది. ఓ హోదాలో ఉన్న వెంకయ్య నాయుడు తెలుగు ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడవద్దని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంకయ్యల మధ్య వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు గానీ, టీడీపీ ప్రతినిధిలా మాట్లాడవద్దని హితవు పలికారు. బీజేపీ ప్రతినిధి అనే విషయం వెంకయ్య మరవకూడదన్నారు.
ఏపీకి తాను పెద్ద దిక్కంటూ వ్యాఖ్యానిస్తున్న వెంకయ్య.. ఈ 15 నెలల్లో రాష్ట్రానికి ఏం తెచ్చారో.. ఏం చేశారో? చెప్పాలని బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. ఆరు కోట్ల ఏపీ ప్రజలను చులకనగా మాట్లాడొద్దన్నారు. మీరు, చంద్రబాబు కలిసే హైదరాబాద్ ను అభివృద్ధి చేశారా?అని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రత్యేక హోదాపై ఈనెల 29న వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కు ప్రజలు సమాయత్తమవుతున్నారన్నారు. బంద్ ను వ్యతిరేకించే వారు అభివృద్ధికి నిరోధకులని ఆయన తెలిపారు.