
ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానే..
- రక్షించిన అటవీ అధికారులు
పాలకుర్తి (వరంగల్): ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానే అని తెగ మదనపడిపోయిందో భల్లూకం. ఈ ఘటన వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో పెద్ద సోమయ్యకు చెందిన వ్యవసాయ బావిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఆహార అన్వేషణకై బయలుదేరిన భల్లూకం (ఎలుగుబంటి) ఓ వ్యవసాయ బావిలో జారి పడిపోయింది. అయితే ఆ బావిలో నీరు లేకపోవడంతో ఎలుగుబంటి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడ లేదు. బిక్కుబిక్కమంటూ బావిలో తిరగసాగింది.
అది గమనించిన గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు అరుణ, శివాజీ వచ్చి ఎలుగుబంటిని బయటకు తీయించి అడవిలో వదిలి పెట్టారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఎలుగుబంటిని చూసేందుకు భారీగా తరలివచ్చారు.