పసిమొగ్గల హృదయ విలాపం
►కన్నబిడ్డను వదిలి వెళ్లిపోయిన మరో తల్లి
►గత కొద్దిరోజుల్లో మూడో ఘటన
►పురిట్లోనే అనాథలుగా శిశువులు
పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం) : కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి వేళ తగరపువలస హైవే పక్కన ఓ బిడ్డను వదిలిపెట్టారు.. మొన్నేమో.. అవయవాలు వృద్ధి చెందకుండా పుట్టిందన్న ఉక్రోషంతో కన్నపేగునే సజీవ సమాధి చేయడానికి ప్రయత్నించాడో కసాయి తండ్రి.. ఇప్పుడేమో.. ఈ లోకంలోకి వచ్చిన రెండో రోజే నన్ను దిక్కులేని దాన్ని చేశావా అమ్మా.. అని ఘోషిస్తోంది ఓ ఆడ శిశువు హృదయం.. మాటల్లో చెప్పలేని ముక్కుపచ్చలారని ఆ పురిటిగుడ్డుకే మాటలొస్తే.. ఆ హృదయ ఘోష ఎలా ఉంటుందంటే.. అమ్మా.. ఎంత పని చేశావు.. నువ్వు మోసపోయిందే కాకుండా.. నన్నూ మోసం చేశావా!
మోసపోయేవారి బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా.. ఇంకా ఈ లోకాన్ని పూర్తిగా చూడకుండానే నన్ను అనాథను చేసి పోవడానికి నీ మనసు ఎలా అంగీకరించిందమ్మా.. అసలు నేను చేసిన నీకు పుట్టడమా లేక ఆడపిల్లగా పుట్టడమా.. నన్ను భరించలేనప్పుడు.. నవమాసాలు మోసి ఎందుకు కన్నావమ్మా.. నాలో ఏ లోపం చూశావమ్మా.. అందంగా ఉన్నానని ఆస్పత్రిలో నర్సులు, డాక్టరమ్మలూ.. అందరూ నన్ను ముద్దు చేస్తున్నారే.. మరి నీకు మాత్రం ముద్దుగా కనిపించలేదా.. ముద్దుమురిపాలు పంచాలనిపించలేదా.. నీ పొత్తిళ్లలో దొరికినంత హాయి.. నాకు ఇంకెక్క లభిస్తుందమ్మా.. నీవు లేని ఈ లోకంలో ఒంటరిగా ఎలా ఉండగలను.. ఎంతమంది అండ లభించినా.. అమ్మ ఇచ్చేంత అండ ఎవరివ్వగలరు.. రేపు ఈ సమాజం నీ తల్లి ఎవరంటే.. ఏం సమాధానం చెప్పాలి.. అందుకే నువ్వెక్కడున్నా.. వెంటనే తిరిగి రా అమ్మా.. నీ వెచ్చని ఒడిలో నన్ను హాయిగా సేదతీరనివ్వమ్మా..
ఆదుకున్న వారినే ఏమార్చి..
పొదివి పట్టుకొని కాపాడుకోవాల్సిన ఈ బిడ్డను పక్కవారికి అప్పగించి పారిపోయిన ఆ కన్నతల్లి కూడా ఏ దిక్కూలేక ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఐదురోజుల క్రితం ఓ నిండు గర్భిణి(30) మల్కాపురంలోని నగరాల వీధికి చెందిన లక్ష్మి అనే మహిళను కలుసుకుంది. తన పేరు జోగాదేవి అని పరిచయం చేసుకుంది. నగరంలోని ఓ హోటల్‌లో పని చేస్తున్న ఓ యువకుడిని ప్రేమించానని.. కన్నవారింటి నుంచి అతనితో వచ్చేసి వివాహం చేసుకున్నానని చెప్పింది. అయితే తన భర్త తమ ఇంటి పక్కనే ఉన్న మరో యువతిని తీసుకొని ఎటో వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది.
నెలలు నిండిన సమయంలో ఎక్కడికి వెళ్లాలో.. ఏం చేయాలో తెలియక ఇలా వచ్చానని తన కష్టం చెప్పుకోవడంతో లక్ష్మి కరిగిపోయింది. తన వివరాలు పూర్తిగా చెప్పకపోయినా సాటి ఆడదానిగా దేవిని అక్కున చేర్చుకుంది. తన కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఇంట్లో ఆశ్రయమిచ్చింది. అలా ఆ ఇంట్లో చేరిన దేవికి ఈ నెల 18(శనివారం) ఉదయం నొప్పులు మొదలయ్యాయి. దాంతో తన సోదరుడు, మరదలి సాయంతో దేవిని ఆటోలో తీసుకొచ్చి ఘోషా ఆస్పత్రిలో చేర్పించడమే కాకుండా అక్కడే ఉండి సపర్యలు చేశారు. అదే రోజు మధ్యాహ్నం జోగాదేవి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
సాధారణ డెలివరీ కావడంతో రెండుమూడు రోజుల్లోనే డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు. కాగా ఈ నెల 19(ఆదివారం) సాయంత్రం ఏడు గంటల సమయంలో బాత్రూముకు వెళతానని చెప్పి బిడ్డను లక్ష్మికి అప్పగించి వెళ్లింది. అయితే ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో బిత్తరపోయిన లక్ష్మి ఆస్పత్రివర్గాలకు సమాచారమిచ్చింది. అంతా కలిసి వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.