పెద్ద నోట్ల రద్దు తొందరపాటు చర్య
- కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి
నంద్యాల: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం తొందర పాటు చర్య అని 20 సూత్రాల కమిషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి విమర్శించారు. పీసీసీ కార్యదర్శి డాక్టర్ రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై కేంద్రం అనాలోచితంగా నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. బ్యాంకులను, డబ్బును సిద్ధం చేసి నిషేధాన్ని ప్రకటించి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదన్నారు.
రూ.2వేల నోటు కూడా గందరగోళానికి గురి చేస్తుందని చెప్పారు. దీని వల్ల సామాన్యులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం ఈ ఇబ్బందులను త్వరితంగా తొలగించాలని కోరారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 19వ తేదీ కోడుమూరులో నిర్వహించే రైతు సదస్సుకు జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు పాల్గొంటారన్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నేత నాగమధుయాదవ్, కడప జిల్లా కాంగ్రెస్ నేత ధ్రువకుమార్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లగిశెట్టి సుబ్బగురుమూర్తి పాల్గొన్నారు.