
కాపు నేతలపై కేసుల వర్షం ..!
- ముద్రగడ సహా 27 మంది కాపు నేతలపై కేసులు
- ఐపీసీ సెక్షన్లు 19/16, 120 (బి),
- పోలీసు యాక్ట్ సెక్షన్లు 7(1), 307, 71
- సభకు హాజరైన నేతలపై దృష్టి
- గ్రామాల్లో పోలీసులు ఆరా, వీడియోల పరిశీలన
- టీడీపీ మినహా అన్నిపార్టీల నేతలపై కేసులు
- కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణచివేసే కుట్ర
- 63 కేసుల్లో ఏ1 నిందితుడిగా ముద్రగడ
- ఆమరణ దీక్షకు ముందే అరెస్టు చేసే అవకాశం
- జిల్లా అంతటా బలగాల మోహరింపు
- అడుగడుగునా వాహనాల తనిఖీలు
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలవాసులంతా సౌమ్యులని, కాపులు సహనశీలురనీ, బయటి నుంచి వచ్చిన శక్తులే విధ్వంసం సృష్టించాయనీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనకు భిన్నంగా ప్రభుత్వం కాపు నాయకులే లక్ష్యంగా బలమైన కేసులు బనాయిస్తోంది. కాపు ఐక్యగర్జన సభ తదనంతరం చోటు చేసుకున్న విధ్వంసకర చర్యల్లో ముద్రగడ పద్మనాభంతో సహా 27 మంది కాపు నేతలపై కేసులు నమోదు చేసింది. ఈ ఘటనలతో సంబంధంలేని కాపు నాయకులను సైతం నిందితులుగా చేస్తూ బలమైన కేసులు బనాయించి కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తాము అధికారంలోకి వస్తే కాపులను బీసీల్లో చేరుస్తామని, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి రూ.వెయ్యికోట్లు విడుదల చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో ఊరూరా ఇవే హామీలిచ్చారు. ఆ తర్వాత అధికారం చేపట్టి 18 నెలలైనా చంద్రబాబు ఆ ఊసు ఎత్తకపోవడంతో ముద్రగడ నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆదివారం కాపు ఐక్యగర్జన నిర్వహించారు.
ఆ సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడం, పోలీసుస్టేషన్‌పై దాడి తదితర సంఘటనలను సాకుగా చూపి కాపులను, కాపు నేతలను, కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం వ్యూహం రచిస్తోంది. అందులో భాగంగానే సభ నిర్వహించిన ముద్రగడ పద్మనాభంతో పాటు వేదికపై ఉన్న నాయకులందరిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
బుధవారం సాయంత్రానికి 150 మంది నిందితులను గుర్తించామని, వారిపై తుని టౌన్, రూరల్ పోలీసుస్టేషన్ల పరిధిలో 63 కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. అందులో ముద్రగడను ప్రథమ నిందితుడి (ఏ1)గా చేర్చుతూ పోలీసులు బుధవారం వరకూ ఏకంగా 63 కేసులు నమోదు చేశారు. మిగతావారిని ఇతరులు అని నమోదు చేసినట్లు చెప్పారు.
కానీ ఆ ఇతరుల జాబితాలో మాత్రం కాపు ఐక్యగర్జన సభకు హాజరైన నాయకులతో పాటు సభకు వెళ్లని కొందరు నాయకులు ఉన్నట్టు తెలిసింది. ఐపీసీ సెక్షన్లు 19/16, 120 (బి), పోలీసు యాక్ట్ సెక్షన్లు 7(1), 307, 71తో పాటు మరికొన్ని సెక్షన్లను ఒక్కో నాయకుడిపై ఒక్కోవిధంగా నమోదు చేసినట్టు సమాచారం. వైఎస్సార్‌సీపీ సహా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
హాజరైనా కేసే...
కాపు ఐక్యగర్జన సభకు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పలువురు కాపు నాయకులు హాజరయ్యారు. సభ తర్వాత వారిలో చాలామంది ముద్రగడను అనుసరించలేదు. ముద్రగడ హఠాత్తుగా రైలు, రాస్తారోకోలకు పిలుపునివ్వడంతో వారంతా నిర్ఘాంతపోయారు. అక్కడ జరుగుతున్న గందరగోళంతో చాలామంది వేదిక దగ్గర నుంచే వెనుదిరిగారు.
విద్రోహులు తగులబెట్టిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ వద్దకు కానీ, తుని రూరల్ పోలీసుస్టేషన్ వద్దకు కానీ వారు వెళ్లలేదు. కానీ పోలీసులు మాత్రం వేదికపైనున్న నేతలందరిపైనా ఆయా విధ్వంసకర సంఘటనలకు సంబంధించిన కేసులను బనాయించినట్టు తెలిసింది. సభకు వెళ్లని నాయకులపై కూడా కేసులు నమోదు చేసేందుకు కారణాలు వెదుకుతున్నారు. మరోవైపు సభకు ఎవరు హాజరయ్యారంటూ గ్రామాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. సెల్‌ఫోన్‌లతో తీసిన వీడియోలను పరిశీలిస్తూ సభకు వచ్చినవారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా కేసులు...
కాపు ఐక్యగర్జన సభ పార్టీలకు అతీతంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి హుకుం మేరకు టీడీపీ ముఖ్యనేతలు హాజరు కాకపోయినా... మధ్య, దిగువ శ్రేణి నాయకులు చాలావరకూ హాజరయ్యారు. కానీ కేసుల్లో దాదాపుగా నిందితులంతా వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందినవారే ఉండటం గమనార్హం.
పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముద్రగడ పద్మనాభంతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన స్థానిక తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు పేర్లు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజు (కాంగ్రెస్), రాష్ట్ర మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ (బీజేపీ), కొప్పన మోహనరావు, వట్టి వసంతకుమార్ (కాంగ్రెస్), మాజీ ఎమ్మెల్సీ గంగాభవానీ (కాంగ్రెస్), తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి.
కాపు సంఘ నాయకులు నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, సినీనటుడు జీవీ సుధాకర్‌పై కేసులు నమోదు చేశారు. వారితో పాటు బీజేపీకి చెందిన అడపా నాగేంద్ర (విజయవాడ), నల్లా పవన్ (అమలాపురం) ఎల్లా దొరబాబు పేర్లు ఉన్నట్టు తెలిసింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ముత్యాల వీరభద్రరావు (కొత్తపేట), దూలిపూడి చక్రం (పసుపులంక), జామి తేనెలంకల (ముమ్మిడివరం) పేర్లు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో వేదపాలేనికి చెందిన బండారు శ్రీనివాసరావు ఒక్కరే టీడీపీకి చెందినవారు. ఈ జాబితాలో నం.1 చానల్ ఎండీ ఎంఎస్‌ఆర్ నాయుడు పేరు కూడా ఉంది. అంతేగాకుండా సభ నిర్వహణకు స్థలం ఇచ్చిన రాజా చినబాబు, వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మరికొందరి నేతల పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నట్టు తెలిసింది. సభకు రాకపోయినా మరికొందరు కాపు నాయకులపైనా కొన్ని సెక్షన్లతో పోలీసులు కేసులు నమోదు చేసినట్టు సమాచారం.
63 కేసుల్లో ఎ-1 ముద్రగడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టు చేయాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లే కనిపిస్తోంది. కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడం, పోలీసుస్టేషన్‌పై దాడి తదితర సంఘటనల్లో ముద్రగడను ప్రథమ నిందితుడి (ఏ1)గా చేర్చుతూ పోలీసులు బుధవారం వరకూ 63 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసువర్గాలే చెబుతున్నాయి.
ముద్రగడ శుక్రవారం తన స్వగ్రామం కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టకముందే ఆయనను అరెస్టు చేయాలని పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి రాష్ట్రపతి, ప్రధాని తదితర అత్యంత ప్రముఖులు రానున్న నేపథ్యంలో కాస్త వేచిచూసే ధోరణి అవలంబించాలని నిఘా వర్గాల నుంచి ప్రభుత్వానికి సూచనలు వస్తున్నట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పలువురు తూర్పుగోదావరి జిల్లాలో మకాం వేసి సమీక్షిస్తున్నారు. ఆమరణ నిరాహారదీక్షకు దిగిన తర్వాత ముద్రగడను అరెస్టు చేయడం కష్టసాధ్యమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ముందుగానే అరెస్టు చేస్తే... ఒకవేళ ఆయన హెచ్చరించినట్టు జైలులో దీక్ష చేసినా బలవంతంగానైనా విరమింపజేయడానికి వీలు ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు.