వినాయక విగ్రహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబుపై కేసు నమోదు చేయాలని అనంతపురం జిల్లా కదిరి జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం పట్టణ పోలీసులను ఆదేశించింది.
కదిరి(అనంతపురం): వినాయక విగ్రహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబుపై కేసు నమోదు చేయాలని అనంతపురం జిల్లా కదిరి జుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం పట్టణ పోలీసులను ఆదేశించింది. గత నెల 6న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న రవీంద్రబాబు వినాయక విగ్రహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కదిరిలో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు, న్యాయవాది అయిన ముల్ల ప్రభాకర్‌రెడ్డి గత నెల 7న పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వినాయకుడి కి నవరాత్రులు పూజలు చేసి కాలువలు, చెరువుల్లో పడేయడమేంటని హిందువులందరినీ కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందూ మహిళలను సైతం ఎంపీ అవమానపరిచారని, బాబాల దగ్గర కు పోయి మహిళలు డబ్బుతో పాటు శీలాన్నీ పోగొట్టుకుంటున్నారంటూ మనోభావాలను దెబ్బతీశారని వివరించారు. అయితే.. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. తాను ఫిర్యాదు చేసి నెల రోజులు పూర్తయినా కదిరి పట్టణ ఎస్‌ఐ సాగర్ కేసు నమోదు చేయలేదంటూ ప్రభాకర్‌రెడ్డి కదిరి కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్పందిస్తూ అమలాపురం ఎంపీపై ఐపీసీ సెక్షన్‌లు 153బీ, 505, 509 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీనిపై పట్టణ ఎస్‌ఐ సాగర్‌ను వివరాలు అడగ్గా.. కోర్టు కాపీ తనకింకా అందలేదని, రాగానే కేసు నమోదు చేస్తామని తెలిపారు.