విజ్ఞాన్ వర్సిటీకి కేంద్ర ప్రాజెక్టు
చేబ్రోలు : ఎర్లీ కెరీర్ రీసెర్చి అవార్డు కింద కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం రూ. 27.5 లక్షల విలువైన ప్రాజెక్టును విజ్ఞాన్ యూనివర్సిటీకి మంజూరుచేసిందని వైస్ చాన్స్‌లర్ సి.తంగరాజ్ తెలిపారు. వడ్లమూడిలోని వర్సిటీలో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వీసీ తంగరాజ్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దక్కిందని తెలిపారు. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సహ ఆచార్యుడు డాక్టర్ దిరిశాల విజయ రాము కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రాజెక్టును దక్కించుకున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా ఆయన∙పరిశోధనలను ముమ్మరం చేయనున్నారని వివరించారు.
జెనిటిక్ ఇంజినీరింగ్ పద్ధతి ద్వారా...
ప్రాజెక్టు దక్కించుకున్న విజయరాము మాట్లాడుతూ క్షయ లాంటి ప్రాణాంతక రోగాల నివారణకు సమర్థవంతమైన వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియలో భాగంగా తాను సమర్పించిన పరిశోధనాత్మక నివేదికకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. క్షయ లాంటి పలు ప్రాణాంతక రోగాలకు ఇప్పటికీ సరైన టీకాలు అందుబాటులో లేవని తెలిపారు. పసి పాపలకు ఇప్పుడు వాడుతున్న క్షయ నివారణ టీకా 0 నుంచి 80 శాతం మాత్రమే పనిచేస్తోందని చెప్పారు. పలు పరిశోధనల ప్రకారం చాలామందిలో క్షయ వ్యాధి నివారణ వ్యాక్సిన్ 0 శాతం పనిచేస్తున్నట్లు నిర్థారణ అయిందని తెలిపారు.
వ్యాక్సిన్ కనుగొనేందుకు గునియా పంది వినియోగం....
సమర్ధవంతమైన వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు తాను గునియా పందిని వినియోగించుకోబోతున్నట్లు చెప్పారు. పందిలో సంబంధిత అణుల అభివృద్ధి కోసం తాను ప్రొటీన్స్ మాలిక్యులర్ బయాలజీ జెనిటిక్ ఇంజినీరింగ్ పద్ధతిని అనుసరించబోతున్నట్లు తెలిపారు. గతంలో అమెరికాలో తాను ఈ ప్రాజెక్టు కోసం శ్రమించానని, ఇప్పుడు మళ్లీ మంచి అవకాశం దక్కిందని, తప్పక విజయం సాధించగలననే నమ్మకం తనకుందని అశాభావం వ్యక్తంచేశారు. ప్రతిభ చూపి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు దక్కించుకున్న విజయరామును చైర్మన్ లావు రత్తయ్య గురువారం తన చాంబర్‌లో ఘనంగా సత్కరించారు. విజయరామును వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, రెక్టార్ బి.రామ్మూర్తి, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ తదితరులు అభినందించారు.