
సినిమాలు చూసి జబ్బులు రాకూడదు
మీరు తీసే సినిమాలను చూసి ప్రజల ఆరోగ్యం బాగుపడాలి కాని, లేనిపోని జబ్బులు రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్మాతలకు సూచించారు.
‘రాజా చెయ్యి వేస్తే’ ఆడియో వేడుకలో చంద్రబాబు
సాక్షి, విజయవాడ: మీరు తీసే సినిమాలను చూసి ప్రజల ఆరోగ్యం బాగుపడాలి కాని, లేనిపోని జబ్బులు రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్మాతలకు సూచించారు. సినిమా వినోదం కోసమని, అయితే కొన్ని సినిమాలు చూస్తే భయం వేస్తుందన్నారు. నందమూరి బాలకృష్ణ సినిమాలు వేరేగా ఉంటాయని, మరికొందరి సినిమాలు చూస్తే రాత్రి నిద్ర పట్టదన్నారు. నారా రోహిత్, తారకరత్న, ఈషా తల్వార్ నటించిన ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్రం పాటలను విజయవాడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలో చంద్రబాబు విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ఏపీలో షూటింగ్‌లకు ప్రపంచంలోనే ఎక్కడా లేని బీచ్‌లు, సుందరమైన ప్రదేశాలు ఉన్నాయన్నారు. సినీ పరిశ్రమ ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తమ కుటుంబం నుంచి వచ్చిన నారా రోహిత్ ‘బాణం’లా దూసుకుపోతున్నాడన్నారు. అమరావతిలో నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్లినప్పుడు అక్కడ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ఒక స్థూపం వద్దకు తీసుకువెళ్లారని, అక్కడ 755 ఏళ్లకు ముందు ఇదే రోజున రాణి రుద్రమదేవి పట్టాభిషేకం చేయడం, ఆవిడ పుట్టినరోజు కావడం విశేషమన్నారు. అదేరోజు ఆడియో రిలీజ్ జరుపుకుంటున్న ‘రాజా చెయ్యి వస్తే’ విజయం సాధిస్తుందన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ... ఇటీవలే ఇద్దరు తాతలు కలసి మనమడి పుట్టినరోజు చేసుకున్నామని, ఇప్పుడు నందమూరి, నారా కుటుంబాలు కలసిన చిత్రం వేడుక చేసుకోవడం ఆనందం గా ఉందన్నారు. మంత్రులు ప్రత్తిపాటి, దేవినేని ఉమా, యాంకర్ ఝాన్సీ పాల్గొన్నారు.