
చావో.. రేవో..!
మా సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆపేది లేదు.. విధుల్లో చేరకుంటే తొలగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయాలకు బెదిరేది లేదు.. చావో..రేవో తేల్చుకుంటాం..’ అంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు స్పష్టం చేశారు.
కడప ఎడ్యుకేషన్:‘ మా సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆపేది లేదు.. విధుల్లో చేరకుంటే తొలగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయాలకు బెదిరేది లేదు.. చావో..రేవో తేల్చుకుంటాం..’ అంటూ కాంట్రాక్ట్ అధ్యాపకులు స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా వ్యాప్తండా 204 మంది అధ్యాపకులతో కలిసి చేపట్టిన దీక్ష శుక్రవారం నాటికి 22 రోజులకు చేరింది. రోజుకొక వినూత్న కార్యక్రమంతో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విచారకమని కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ వాపోయింది. కాగా రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళనను విరమించి విధుల్లోకి వెళ్లాలని లేకుంటే వీరిని విధుల నుంచి తొలగించమని సంబంధిత ఆర్‌జేడీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోకాళ్లపై నిలబడి..
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం కాంట్రాక్ట్ అధ్యాపకులు కలెక్టర్ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 25 ప్రభుత్వ కళాశాలల పరిధిలో 204 మంది అధ్యాపకులు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నామన్నారు. ఇందులో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మాత్రం కేవలం కాంట్రాక్టు అధ్యాపకులు మాత్రమే పనిచేయడంతో సంబంధిత కళాశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం నుంచి తమకు సరైన హామీ రాకపోగా శుక్రవారం నుంచి విధులకు హాజరుకావాలని లేని పక్షంలో విధుల నుంచి తొలగించాలని ఆదేశించిందన్నారు. కానీ ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడమని తెగేసి చెప్పారు. తమకు న్యాయం జరగడంతోపాటు ఉద్యోగ భద్రతను కల్పిస్తేనే దీక్షల నుంచి విరమించుకుంటామని స్పష్టం చేశారు.
సరైన నిర్ణయం రాకపోతే:
ఈనెల 26న కేబినేట్ మీటింగ్‌లో సరైన నిర్ణయం వెలువడకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం. 27 నుంచి వెలగపూడిలో జేఏసీ పిలుపుమేరకు ఆమరణ నిరాహార దీక్షను చేపడతాం. – జానీబాబు, జేఏసీ నాయకుడు.
ఉద్యోగ భద్రత కల్పించాలి:
మాకు ప్రభుత్వం నుంచి ఉద్యోగ భద్రత కల్పించే వరకూ ఉద్యమాన్ని ఆపం. 21 రోజుల నుంచి దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాలేదు. ఇప్పుడేమే విధుల్లో చేరాలని ఆదేశించింది. ఎలాంటి హామీ ఇవ్వకుండా విధుల్లో ఎలా చేరాలి. – సుబ్బయ్య, జేఏసీ నాయకుడు.
తాడోపేడో తేలాలి..
మాకు ఉద్యోగ భద్రత ఇవ్వడంతోపాటు సమాన పనికి సమాన వేతనాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. సంబంధిత విషయాల్లో తాడోపేడో తేలేవరకూ ఉద్యమాలను ఆపం. 21 రోజుల నుంచి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వ ఎలాంటి హామీ ఇవ్వకుండా దీక్షలు ఎత్తేయమనటం సబబుగా ఉందా. – ఉమాదేవి, జేఏసీ నాయకురాలు.