బాలల రక్షణే..భారత రక్షణ
బాలల రక్షణే..భారత రక్షణ
Published Tue, Sep 19 2017 11:26 PM | Last Updated on Wed, Sep 20 2017 11:51 AM
- నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి
కర్నూలు: బాలల రక్షణే భారత రక్షణ అని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నారు. బాలికలపై అత్యాచారాలు, ఆకృత్యాలు జరగడం బాధకరమని, అలాంటి వాటిని దేశం నుంచి తరిమికొట్టేందుకే తాను ఉద్యమం చేపట్టానన్నారు. బాలల హక్కులపై చైతన్యం తీసుకురావడానికి ఆయన చేపట్టిన భారత్ యాత్ర మంగళవారం కర్నూలు చేరింది. ఈ సందర్భంగా రాజ్‌విహార్ సెంటర్ నుంచి ఏపీఎస్పీ రెండో పటాలం మైదానం వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కైలాష్ సత్యార్థితో కలసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో జరిగిన బహిరంగ సభలో సత్యార్థి ప్రసంగించారు.
పిల్లలపై వేధింపులు, అక్రమ రవాణాను అరికట్టేందుకు తాను 11 వేల కిలోమీటర్ల మేర 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా భారతయాత్ర చేపట్టానన్నారు. యాత్ర సందర్భంగా అనేక మంది పిల్లలను తాను కలుస్తున్నానని... సొంత కుటుంబ సభ్యులే వారిపై లైంగికదాడులకు పాల్పడుతున్న సంఘటనలు చూసి ఎంతో బాధేస్తోందన్నారు. బుద్ధుడు, మహాత్మాగాంధీలు పుట్టిన భారతదేశంలో తాను జన్మించడం గర్వంగా ఉందన్నారు. భారతదేశంలో లైంగిక వేధింపులు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అవమానపరచడంపై 15 వేల కేసులు రిజిష్టర్ అయ్యాయని చెప్పారు. ఇందులో 4 శాతం పరిష్కారం కాగా 90 శాతం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. పాఠశాల ఆవరణలో పిల్లలు అవమానాలకు గురవుతున్నారని, వారికి జరిగిన అన్యాయంపై త్వరితగతిన తీర్పులు వెలువడాలన్నారు.
భారతదేశం యువత విద్య, ఆరోగ్యానికి 4శాతం ఖర్చు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును 2001లో తాను కలిశానని, రాజకీయం, అభివృద్ధి సంక్షేమం పథకాలు హృదయంతో చేయాలన్నారు. ఎంత ఆస్తి సంపాదించినా పిల్లల సంరక్షణ లేకపోతే వృథానేనని అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహితులుగా మెలగాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలబాలికలు విద్య, ఆరోగ్యంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, కలెక్టర్ సత్యనారాయణ, డీఐజీ ఇక్బాల్ హుస్సేన్, ఎస్పీ గోపీనాథ్‌జట్టి, మాజీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి యాదవ్, రాజ్యసభ సభ్యులు టీ.జీ.వెంకటేష్, ఎంపీ బుట్టా రేణుక, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జెడ్పీ, కేడీసీసీ చైర్మన్‌లు మల్లెల రాజశేఖర్, మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, టీడీపీ నాయకులు కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్ పాల్గొన్నారు.
హక్కులపై అవగహ కల్పిస్తా..
ఓర్వకల్లులోని కస్తూరిబా గాంధీ భవన్ విద్యాలయ విద్యార్థిని శ్యామల తాను 7వ తరగతి చదువుతున్నానని, తనకు విద్యతో పాటు అన్ని విషయాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారని, 1098 మంది బాల కార్మికులను కాపాడి కేజీబీవీలలో చేర్పించారని చెప్పింది. తాను పెరిగి పెద్దయ్యాక నలుగురికి హక్కులపై అవగాహన కల్పిస్తానని చెప్పింది. ఇంట్లో ఒక అమ్మాయి చదివితే దేశం మొత్తం బాగుపడుతుందని వెల్లడించింది.
మనోధైర్యం నింపారు..
కర్నూలు పట్టణానికి చెందిన పల్లవి మాట్లాడుతూ తాను 9వ తరగతి చదువుకుంటున్న సమయంలో ఓ వ్యక్తి తనను ప్రేమించి మోసం చేశాడని దీంతో తాను ఆత్మహత్యకు పాల్పడే సమయంలో పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది తనలో మనోధైర్యం నింపి విద్యాబుద్ధులు నేర్పించారని చెప్పింది. అనంతరం కైలాస్ సత్యార్థి, ఆయన సతీమణి సుమేధ సత్యార్థిలను మెమోంటో, శాలువాతో సీఎం సత్కరించారు. ఆ తర్వాత మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముద్రించిన కిశోరి వికాసం బ్రోచర్లను సీఎం, కైలాస్ సత్యార్థి ఆవిష్కరించారు. అంతకుముందు సురక్షిత భారతదేశం ఛాయచిత్రాలను వారు తిలకించారు.
Advertisement
Advertisement