విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
నెల్లూరు(టౌన్) : విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో కూడా రాణించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. బుధవారం నెల్లూరులోని ఎస్–2 థియేటర్ కాంప్లెక్స్‌లో చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెన్నైకు చెందిన చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఫెస్టివల్‌ను ఏర్పాటుచేయడం సంతోషకరమని తెలిపారు. నగరంలో ఎస్–1, ఎస్–2, ఎస్–3 థియేటర్లతో పాటు అర్చన, లీలామహల్, కావలిలోని లత థియేటర్, గూడూరులోని సుందరమహల్, శ్రీనివాసతేజ, చదలవాడ వెంకటేశ్వర థియేటర్లులో ఈనెల 24వ తేదీ వరకు బాలల చలన చిత్ర పద్రర్శనలు జరుగుతాయన్నారు. ఇంగ్లిష్ చిత్రం ప్రిన్స్, క్రౌన్ ఆఫ్ స్టోన్, హిందీ చిత్రం ఎహ్ హై చెక్కడ్ బక్కడ్ బొంబాయి బో, తెలుగు చిత్ర అమూల్యం ప్రదర్శిచడం జరుగుతుందన్నారు. వీటి ద్వారా వినోదంతో పాటు విద్యార్థుల ఆలోచనల్లో మార్పుచోటుచేసుకునే అవకాశముందన్నారు. డీఈఓ మువ్వా రామలింగం మాట్లాడుతూ బాలల చిత్రాలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తాయన్నారు.