టీడీపీ, బీజేపీ మధ్య తారస్థాయికి విభేదాలు
మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా శంకుస్థాపనలు
జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి వైఖరిపై సీఎంకు ఫిర్యాదు
దిగివచ్చిన టీడీపీ అధిష్టానం
ముళ్లపూడి దూకుడుకు కళ్లెం వేస్తామని హామీ
ఏలూరు : మిత్రపక్షాలు వైరివర్గాలుగా మారాయి. ‘కలిసి మెలిసి విరోధం’ అన్నచందంగా కత్తులు దూస్తున్నాయి. తాజాగా తాడేపల్లిగూడెం కేంద్రంగా టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు బుధవారం మరోసారి భగ్గుమన్నాయి. ఈ నియోజకవర్గంలో మిత్రపక్షాల మధ్య చెలిమి దాదాపు కంచికి చేరింది. నియోజకవర్గంలో తన ముద్ర ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, తమ పట్టు కోల్పోకూడదని జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఎవరికి వారే పంతాలకు పోతుండటంతో ఇరువురి మధ్యా రాజకీయ రచ్చ తారస్థాయికి చేరింది.
మంత్రి మాణిక్యాలరావుకు తెలియకుండా ముళ్లపూడి బాపిరాజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలోని పెంటపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం సన్నద్ధం కావడం వివాదానికి దారితీసింది. దీనిపై మంత్రి మాణిక్యాలరావు సీరియస్ అయ్యారు. ప్రారంభోత్సవాలను నిలుపుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అవసరమైతే తాను మంత్రి పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోనని అల్టిమేటం ఇచ్చారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
పొత్తు ‘పొడిచింది’
పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం స్థానాన్ని టీడీపీ వదులుకుంది. ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో పైడికొం డల మాణిక్యాలరావు పోటీచేసి విజయం సాధించారు. తదనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. ఇదే సీటును ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి, తప్పని పరిస్థితుల్లో రేసు నుంచి తప్పుకున్న ముళ్లపూడి బాపిరాజుకు మంత్రితో విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముళ్లపూడిని బుజ్జగించి ఆయనకు జెడ్పీ చైర్మన్ గిరీ కట్టబెట్టారు.
పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఈలి నాని టికెట్ ఆశించి టీడీపీలో చేరారు. ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. ఎన్నికల నాటి విషయాలు ఇలా ఉంటే.. నియోజకవర్గంలో తనదైన మార్కు కోసం మాణిక్యాలరావు ప్రయత్నించడం, తమను కలుపుకుని వెళ్లడం లేదంటూ టీడీపీ నేతలు కయ్యానికి కాలు దువ్వడంతో విభేదాలు ముదిరాయి.
గతంలో రాష్ర్ట ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సమక్షంలో జెడ్పీ చైర్మన్, మంత్రి ఒకరినొకరు విమర్శించుకున్న సంగతి తెలిసిందే. మంత్రి శిద్ధా రాఘవరావు పెంటపాడు మండలం ప్రత్తిపాడు సర్పంచ్ ఇంటికి మాణిక్యాలరావుతో కలసి వెళ్లారు. అదే సమయానికి అక్కడకు వచ్చిన జెడ్పీ చైర్మన్ బాపిరాజు ఆవేశంగా.. మీరు ఇటీవలే బీజేపీలో చేరిన సర్పంచ్ భర్త వీర్ల గోవిందు వద్దకు వెళ్తే టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిం టాయని మంత్రి శిద్ధాను ఉద్దేశించి అన్నారు. ఇందుకు మంత్రి మాణిక్యాల రావు అభ్యంతరం చెప్పగా, బాపిరాజు ఆవేశంగా.. ‘చాన్నాళ్లు ఓపికపట్టాం. మీ తీరు భరించలేకే ఇలా మాట్లాడుతున్నాం’ అంటూ విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కూడా బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం చారిత్రక తప్పిదమంటూ బాపిరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘మంత్రిది, నాదీ ఒకేస్థాయి. ఆయనకు నీలం బుగ్గ కారు ఉంది. నాకూ ఉంది. అభివృద్ధి కోసం బీజేపీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మాకు జిల్లాలో ఏ మూలకు వెళ్లినా బోల్డంత పార్టీ కేడర్ ఉంది’ అంటూ గతంలో బాపిరాజు వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో 15వ వార్డు కౌన్సిలర్ చుక్కా కన్నమనాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి పీతల సుజాత సమక్షంలోనూ మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రి హోదాలో మాణిక్యాలరావు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వెళుతుంటే టీడీపీ నుంచి సర్పంచ్ స్థాయి వ్యక్తి కూడా హాజరు కావడం లేదు. దీంతో తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘ఇక్కడ ప్రైవేటు సామ్రాజ్యం నడుస్తోంది.
కేబినెట్ క్యాడర్ కలిగిన మంత్రి వస్తే సర్పంచ్ కూడా రావడం లేదు’ అని మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు చేసేం తగా విబేధాలు పెరిగిపోయాయి. తాజాగా పెంటపాడు మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రికి ఆహ్వానం లేకపోవడం వివాదాస్పదమైంది. విషయం తెలుసుకున్న మాణిక్యాలరావు వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావుతోపాటు ఉన్నతాధికారులకు ఫోన్లుచేసి బాపిరాజు తీరుపై ఫిర్యాదు చేశారు.
దీంతో పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు వెంటనే శంకుస్థాపన కార్యక్రమాలు వాయిదా వేయాలంటూ ముళ్లపూడికి సూచించారు. చంద్రబాబునాయుడు మంత్రితో మాట్లాడుతూ తొందరపడవద్దని, అన్ని విషయాలు మాట్లాడుకుందామని నచ్చచెప్పారు. విజయవాడలో జరిగే కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రానుండటంతో ఆయన వద్దే ఈ పంచాయితీ తేల్చేందుకు మంత్రి మాణిక్యాలరావు సన్నద్ధం అవుతున్నారు. దీనిపై జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ ఇద్దరి మధ్యా విభేదాలు లేవని, ఆయన ప్రభుత్వ నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే తాను జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని పరోక్షంగా హెచ్చరిం చారు. ఇరువురి మధ్య పంచాయితీ సీఎం చెంతకు చేరడంతో దీనికి ముగింపు ఏ విధంగా పలుకుతారనే అంశంపై రాజ కీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.