సామాన్యుడూ ప్రధాని కావచ్చు
సామాన్యుడూ ప్రధాని కావచ్చు
Published Sun, Sep 11 2016 12:13 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
పాలకుర్తి: కుటుంబ పాలనకు చరమగీతం పాడి, సామాన్యుడు సైతం భారత ప్రధాని కావచ్చని నిరూపించిన ఘనత భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కే దక్కుతుందని కేంద్ర ఆహార ఉత్పత్తులు, పరిశ్రమల శాఖ మంత్రి సాద్వి నిరంజన్‌జ్యోతి అన్నారు. శనివారం పాలకుర్తి పట్టణంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట యో««దlురాలు, చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక బషారత్ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు పెదగాని సోమయ్య అధ్యక్షతన నిర్వహించిన అయిలమ్మ వర్ధంతి సభలో సాద్వి నిరంజన్ జ్యోతి మాట్లాడారు. యూపీఏ హయాంలో ఒ్కసారైనా కేంద్రమంత్రులు ఐలమ్మకు నివాళులర్పించడానికి వచ్చారా? అని ఆమె ప్రశ్నించారు. అప్పట్లో దేశంలో రోజుకు సగటున 2 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరిగితే, ప్రస్తుతం 20 కిలోమీటర్ల మేర రహదారుల పనులు జరుగుతున్నాయన్నారు. నేటి యువత చేతిలో ఉండాల్సింది ఆయుధాలు కాదని పుస్తకాలు, కంప్యూటర్లు అని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు.
హామీలను విస్మరించిన కేసీఆర్ : లక్ష్మణ్
తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వరంగల్ పట్టణంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని ప్రజలకు ఇచ్చిన మాట ఇప్పటిదాకా అమలుకాలేదన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, జయపాల్, చాకలి అయిలమ్మ మనుమడు చిట్యాల రాంచంద్రం, అయిలమ్మ కుటుంబ సభ్యులు, సామాజిక తెలంగాణ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభంజన్ యాదవ్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్, కుమార్, రాజశేఖర్, నరేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement