‘గురుకుల’ కౌన్సెలింగ్ గందరగోళం
‘గురుకుల’ కౌన్సెలింగ్ గందరగోళం
Published Sat, May 27 2017 11:11 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
– కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయని అధికారులు
– ఇబ్బందులు పడిన విద్యార్థులు
డోన్ టౌన్: గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశానికి డోన్ పట్టణంలోని గురుకుల పాఠశాలలో శనివారం నిర్వహించిన కౌన్సెలింగ్ గందరగోళంగా మారింది. జిల్లావ్యాప్తంగా గురుకుల 880 సీట్లు ఉండగా.. 2,300 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. పట్టణానికి 5 కి.మీ దూరంలో ఉన్న ఈ పాఠశాల ఆవరణలో కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. ఒక క్రమపద్ధతి పాటించకపోవడంతో, ఒకే సారి కేంద్రంలోకి విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను అనుమతించడంతో తోపులాట జరిగింది. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్.. పోలీసులు వచ్చిన తరువాత 12 గంటలకు ప్రారంభమైంది.
కనీస సౌకర్యాలేవీ..?
పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడ్డారు. తాగునీటి వసతి లేకపోవడంతో దాహంతో అల్లాడారు. జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరవుతారని అధికారులకు తెలిసినా..ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. పట్టణం నుంచి పాఠశాలకు ఎలాంటి వాహన సౌకర్యం లేకపోవడంతో ఆటో డ్రైవర్లు ఇష్టానుసారంగా చార్జీలు వసూలు చేశారు. ఇదిలా ఉండగా.. కౌన్సెలింగ్ నిర్వాహణను జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమూర్తి తనిఖీ చేశారు. ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం వెంటనే కల్పించాలని ప్రిన్సిపాల్ ఉమాకుమారిని ఆదేశించారు. సౌకర్యాలు లేకుండా కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారని జిల్లా కో ఆర్డినేటర్ కృష్ణమూర్తితో ఎస్‌ఎఫ్ నాయకులు శివశంకర్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు శివన్న తదితరులు వాగ్వాదానికి దిగారు.
Advertisement