
కోడలితో రాజయ్య కుటుంబానికి గొడవలు
వరంగల్ : ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్-సారికలది ప్రేమ వివాహం. 2006లో పెద్దవాళ్లకు తెలియకుండా ఆర్య సమాజ్‌లో పెళ్లిచేసుకున్న వీరు... అమెరికా వెళ్లిపోయారు. అక్కడ సారిక ఉద్యోగం చేసేది. ఆమె సంపాదనతోనే భర్త అనిల్ జల్సాలు చేసేవాడని సమాచారం. కొన్నాళ్ల తర్వాత ఇండియా వచ్చిన వీరు... తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో రాజయ్య కుటుంబం... సారికను ఇంట్లో నుంచి గెంటేశారు. కొద్దిరోజుల తర్వాత రాజీ కుదిరి యాదగిరిగుట్టలో పెద్దలంతా కలిసి మళ్లీ అనిల్-సారికల పెళ్లి చేశారు. ఆ తర్వాత సారిక-అనిల్‌ను చిలకలగూడలో ఓ ఫ్లాట్ తీసుకుని కాపురం పెట్టారు.
అయితే అనిల్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడంతో.... విసుగు చెందిన సారిక భర్తతోపాటు వరంగల్‌లోని అత్తింటికి వచ్చేసింది. ఆ తర్వాత చిలకలగూడలోని ఫ్లాట్‌లో... అనిల్ మరో అమ్మాయితో వుంటున్నాడని తెలుసుకున్న సారిక... అతనితో గొడవపడింది. అనిల్ తల్లిదండ్రులు కూడా కొడుకునే సపోర్ట్ చేయడంతో సారిక పోలీసులను ఆశ్రయించింది. ఇల్లు వదిలి వెళ్తే పరువు పోతుందని... ఇంట్లో ఉంటూనే భర్త, అత్తమామలపై చాలాసార్లు కేసు పెట్టింది.
2002 సంవత్సరంలో రాజయ్య కొడుకు అనిల్‌తో సారికకు పరిచయం ఏర్పడింది. 2006లో అనిల్, సారిక ప్రేమ వివాహం జరిగింది. రాజయ్య కోడలు సారికది నిజామాబాద్ జిల్లా. తనను, తన పిల్లలను సరిగా చూసుకోవడం లేదని, గతంలో అనేక సార్లు సారిక నిరసనకు దిగింది. కోర్టులో కేసు వేయగా అది విచారణలో ఉంది. కొద్దిరోజుల కిందట రాజయ్య ఇంటిముందు ధర్నాకు దిగారు. ప్రమాదం జరిగిన సమయంలో రాజయ్యతో పాటు ఆయన కుమారుడు అనిల్ కూడా ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం.
కాగా ఈ ఘటనపై సారిక కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాము వచ్చేంతవరకు మృతదేహాలను కదిలించవద్దని పోలీసులను అభ్యర్థించినట్లు సమాచారం. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తున్నందున అగ్నిప్రమాదం జరిగిన మొదటి అంతస్తులోకి పోలీసులు మీడియాను అనుమతించడం లేదు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీద్ బాబు స్వయంగా సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాజయ్య కోడలు, మనవళ్ల మృతితో వారు నివసిస్తున్న ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.