టీఆర్‌ఎస్‌లోకి పువ్వాడ అజయ్
నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో చేరనున్నట్లు ప్రకటన
కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆవేదన
ఖమ్మం: కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆ పార్టీని వీడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఆయన ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేశానన్నారు. అంపశయ్యపై ఉన్న పార్టీని బతికించుకునేందుకు చేసిన ప్రతి ప్రయత్నాన్ని పార్టీలోని పలువురు నాయకులు అడ్డుకున్నారని అజయ్ ఆరోపించారు. ఇటీవల ప్రకటించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నియామకాల్లోనూ తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదన్నారు. పార్టీ కోసం కాకుండా రాజకీయాలు చేసేవారికి పార్టీలో పెద్దపీట వేస్తున్నారని చెప్పుకొచ్చారు.
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తలపెట్టిన అభివృద్ధి పనులను అడ్డుకోవాలని, వాటికి వ్యతిరేకంగా విమర్శలు చేయాలని పార్టీ నాయకులు సూచించడం శోచనీయమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులపై సీఎం చేసిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వ్యతిరేకించి తప్పు చేశామన్నారు. ఇలా ప్రతి అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం, నిధులు రాకుండా హడ్కోకు ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లా, ఖమ్మం నియోజకవర్గం అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని గ్రహించే ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. సోమవారం తన అనుచరులతో హైదరాబాద్ బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌లో చేరతానని ప్రకటించారు. జిల్లా అభివృద్ధిని కాంక్షించే కాంగ్రెస్ నాయకులు తన వెంట రావాలని కోరారు.