కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం
ఏలూరు రేంజిలోని మూడు జిల్లాలకు సంబంధించి కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల ఎంపికలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. సోమవారం కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ఏలూరులో ప్రారంభమైంది.
ఏలూరు అర్బన్ : ఏలూరు రేంజిలోని మూడు జిల్లాలకు సంబంధించి కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల ఎంపికలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించామని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. సోమవారం కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి కమ్యూనికేషన్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ఏలూరులో ప్రారంభమైంది. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు అధికారులు అభ్యర్థులకు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఫిజికల్ మెజర్‌మెంట్, ఎబిలిటీ టెస్ట్‌లను నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఎంపిక పరీక్షల్లో తొలిసారిగా పూర్తి పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఎంపిక విధానానికి సంబంధించి బయోమెట్రిక్, రేడియో ఫ్రీక్వెన్సీ వంటి ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నందున ఎంపిక ప్రక్రియ యావత్తూ పూర్తి నిష్పక్షపాతంగా జరుగుతుందన్నారు. అడిషనల్ ఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ పరీక్షలకు ఏలూరు రేంజిలో 14,700 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. డిసెంబర్ 2 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇచ్చిన గడువు తేదీన ఏ కారణంగానైనా పరీక్షలకు హాజరుకాలేకపోతే వారికి తిరిగి నవంబర్ 28న ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.