అభివృద్ధి పనుల్లో ‘అవినీతి’ రాజ్యం
అభివృద్ధి పనుల్లో ‘అవినీతి’ రాజ్యం
Published Mon, Jul 25 2016 10:48 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
కాంట్రాక్టర్ల చేతిలోనే క్వాలిటీ కంట్రోల్!
మూణ్ణాళ్ల ముచ్చటగా రోడ్ల నిర్మాణాలు
అధికారులకు లంచాల మేత
కొమ్ముకాస్తూ బిల్లులు చేస్తున్న యంత్రాంగం
ప్రత్తిపాడు : అభివృద్ధి పనుల పేరుతో అవినీతి అడ్డగోలుగా రాజ్యమేలుతోంది. ప్రతి పనిలోనూ కాంట్రాక్టర్లు కక్కుర్తి పడుతున్నారు. దీంతో నాణ్యత మచ్చుకైనా కనిపించటం లేదు. క్వాలిటీ కంట్రోల్ కాస్తా అధికారుల చేతిలో నుంచి కాంట్రాక్టర్ల చేతిలోకి వెళ్లిపోతుండటంతో అభివృద్ధి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. లంచాల మేత ప్రభావంతో మంత్రి రావెల కిశోర్‌బాబు ఇలాకాలో అవినీతి ఊట రోడ్లపై ఏరులై పారుతోంది. అందుకు సజీవ సాక్ష్యాలే ఇవి.
రూ.10 లక్షలతో మరమ్మతులు..
మండల పరిధిలో ప్రత్తిపాడు నుంచి పాత మల్లాయపాలెం వెళ్లే ప్రధాన రహదారికి ఇటీవలే రూ.10 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. పనులు నాసిరకంగా చేయడంతో ఇప్పుడు ఆ రోడ్డులో ప్రయాణం నరకప్రాయంగా మారింది. కంకర రాళ్లు పైకి లేచి ప్రయాణికులను ఇబ్బందులపాలు చేస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై.. నాణ్యతను, నిబంధనలను గాలికొదిలేసి ‘క్వాలిటీ కంట్రోల్’ను తమ చేతుల్లోకి తీసుకోవడంతో రహదారి దారుణంగా తయారైంది. నాలుగు నెలలు కూడా తిరగకుండానే అక్షరాలా పది లక్షల రూపాయలు రాళ్లపాలయ్యాయి.
ఏడాది తిరక్కుండానే..
తిక్కిరెడ్డిపాలెం వెళ్లే రోడ్డు పూర్తిగా ఛిద్రమైపోవడంతో కొంతమేర తారురోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. రూ.10 లక్షల జిల్లా పరిషత్ నిధులతో 550 మీటర్ల మేర సుమారు పది నెలల కిందట తారురోడ్డును నిర్మించారు. దాని నాణ్యత మేడిపండు చందంగా మారింది. నిర్మించిన రెండు నెలలకే స్పీడ్‌బ్రేకర్ ఉన్నచోట పూర్తిగా ఛిద్రమై, పగుళ్లివ్వడంతో గతంలోనే అతుకులు వేశారు. ఇప్పుడు రోడ్డు ఆరంభంలో పెద్దగుంత పడింది. దానిని పూడ్చేందుకు మధ్యలో ఓ రాయిని పడేశారు.
రూ.53 లక్షల ‘తారు’ణం..
మండలంలోని 16వ నంబరు జాతీయ రహదారి నుంచి తిక్కిరెడ్డిపాలెం వరకు రూ.53 లక్షల రూపాయల పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ నిధులతో సుమారు మూడు నెలల కిందట తారు రోడ్డును నిర్మించారు. అనంతరం రోజుల వ్యవధిలోనే ఆ రోడ్డు మార్జిన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పగుళ్లిచ్చి అధికారుల నిర్వాకాన్ని, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణను వెక్కిరిస్తున్నాయి. రెండు నెలలకే రోడ్డు అధ్వానంగా తయారవ్వడంపై జనం పెదవి విరుస్తున్నారు.
సబ్‌ప్లాన్ పనుల్లోనూ పగుళ్లే..
గొట్టిపాడు ఆది ఆంధ్రా కాలనీలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి సుమారు కోటీ 3 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. సీసీ రోడ్డుకు సపోర్టు ఉండేందుకు గాను రోడ్డుకిరువైపులా నిర్మిస్తున్న కాంక్రీట్ పనులు నాసిరంగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పక్క పనులు జరుగుతుండగానే మరోపక్క కాంక్రీట్‌తో పోసిన సపోర్టులు పగిలిపోతుండటం ఈ పనుల్లో అవినీతికి తార్కాణం.
Advertisement