ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు
-
-
- గైట్‌లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ
-
- సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
రాజానగరం : గత మూడు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వల్ల దేశంలోని కార్మిక, కర్షక, బడుగు వర్గాలకు జరిగిన మేలంటూ ఏదీ లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. ఈ విధంగా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల పై వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలతో కలసి ఉద్యమాలు నిర్వహిస్తున్నాయన్నారు. గైట్ ఇంజినీరింగ్ కళాశాల క్యాంపస్‌లో శనివారం నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇటువంటి సదస్సుల ద్వారా రాజకీయ అవగాహనను పెంపొందించుకుని, భవిషత్తులో చేపట్టే ఉద్యమాలు, పోరాటాల్లో చురుకైన పాత్రను పోషించడం ద్వారా పాలకులకు మీ ఉనికిని తెలియజేయాలని కార్మిక, కర్షక సంఘాలకు పిలుపునిచ్చారు. బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద పాచికను తీవ్రంగా ఎండగట్టాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత పూర్తిగా విస్మరిస్తున్నారన్నారు. విజయ్‌మాల్యా, ఆదానీ వంటి వ్యాపారవేత్తలకు రూ.13 లక్షల 50 వేల కోట్లు బ్యాంకుల్లో రుణాలను రద్దు చేయడం, పేటీఎం వంటి సంస్థలకు మేలు చేకూర్చేలా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం వంటి చర్యలు చూస్తుంటే దేశంలో సామాన్యుడి మనుగడ ఏమవుతుందోననే భయం కలుగుతుందన్నారు.నల్లధనాన్ని వెనక్కి తీసుకువచ్చి ప్రతి పేదోడి బ్యాంకు అకౌంటులోని జమ చేస్తానని చెప్పిన ప్రధానమంత్రి ఇంతవరకు ఆ పని చేయకుండా ఎందుకు మొహం చాటేస్తున్నారన్నారు. పెద్దనోట్ల రద్దుతో కరెన్సీ కష్టాలు పేద, మధ్య తరగతికి వస్తే పెద్దోళ్లు తమ నల్లధనాన్ని స్వేచ్ఛగా మార్చుకునే వెసులుబాటు కలిగించారన్నారు. జీఎస్టీ ద్వారా ప్రజల ఆర్థిక భారం మోపుతున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీకేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నగర కార్యదర్శి నల్లా రామారావు, జట్లు సంఘం అధ్యక్షుడు వంగమూడి కొండలరావు, ప్రధాన కార్యదర్శి యడ్ల అప్పారావు, బీకేఎంయు జిల్లా కార్యదర్శి నక్కా కిశోర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిర్ల కృష్ణ, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నల్లా భ్రమరాంబ, ప్రధాన కార్యదర్శి ఎం. నాగమణి, సేపేని రమణమ్మ, డీహెచ్‌పీఎస్ ప్రధాన కార్యదర్శి కుంచే అంజిబాబు, తోకల ప్రసాద్, సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.