మన్యంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.
డుంబ్రిగుడ: మన్యంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని అరమ పంచాయతీ కేంద్రానికి వెళ్లే మార్గంలో కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కల్వర్టు నిర్మాణం చేపట్టి ఏడాది గడవక ముందే కొట్టుకుపోయిందని, నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానికులు చెబుతున్నారు. కల్వర్టు కొట్టుకుపోవడంతో రాకపోకలు సాగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కల్వర్టు నిర్మించాలని వారు కోరుతున్నారు.ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం నిర్మించిన అరమ రోడ్డు కురుస్తున్న వర్షాలకు రాళ్లు తేలిపోయాయి. పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆ ప్రాంతం ప్రజలు కోరుతున్నారు.