
విత్‌డ్రాలతో సరి
- -ఏమాత్రమూ తగ్గని కరెన్సీ కష్టాలు
– నగదు మార్పిడి నిలిపేసిన బ్యాంకర్లు
– వేధిస్తున్న నగదు కొరత
- తక్షణం సరఫరా కాకుంటే మరిన్ని ఇబ్బందులు
– నేడు రూ.500 నోట్లు వస్తాయంటున్న అధికారులు
అనంతపురం అగ్రికల్చర్ : పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల కష్టాలు ఏమాత్రమూ తీరడం లేదు. పైగా రోజురోజుకూ పెరుగుతుండడంలో ఆందోళన రెట్టింపవుతోంది. బ్యాంకుల్లోనే నగదు ఖాళీ అవుతోంది. అరకొరగా వస్తున్న నోట్ల కట్టలను ప్రజలకు సర్దుబాటు చేస్తున్నారు. నగదు సరఫరా మందకొడిగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. తక్షణం తగినంత నగదు సరఫరా కాకపోతే సమస్య తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోనూ రూ.2 వేల నగదు మార్పిడిని పూర్తిగా నిలిపేశారు. అనంతపురం సాయినగర్ ఎస్‌బీఐ ప్రధాన శాఖలో మాత్రం ఒక కౌంటర్ ద్వారా మధ్యాహ్నం వరకు నగదు మార్పిడి చేశారు.
సిండికేట్, ఆంధ్రా, ఏపీజీబీ, కెనరా, ఎస్‌బీహెచ్ లాంటి ప్రధాన బ్యాంకుల్లో నగదు మార్పిడికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. విత్‌డ్రాలు కూడా మరీ అత్యవసరమని వేడుకుంటే తప్ప.. ఒకేసారి రూ.24 వేలు ఎక్కడా ఇవ్వడంలేదు. రూ.4 వేల నుంచి మొదలు పెట్టి గరిష్టంగా రూ.10 వేలు ఇస్తున్నారు. రూ.100 నోట్ల కొరత తీవ్రంగా వేధిస్తుండగా, ఇప్పుడు రూ.2 వేల నోట్ల నిల్వలు కూడా చాలా బ్యాంకుల్లో అయిపోయాయి. జిల్లాలో 556 ఏటీఎంలకు గానూ 140 -150 మాత్రమే పనిచేస్తున్నాయి. వీటిలోనూ ఒక్కో ఖాతాదారునికి గరిష్టంగా ఒక రూ.2 వేల నోటు మాత్రమే వస్తోంది. వందలు పెట్టకపోవడంతో చిల్లర సమస్యతో సతమతమవుతున్నారు. రూ.2 వేల నోట్లు కూడా అయిపోవడంతో కొన్ని ఏటీఎంలు పాక్షికంగా సేవలందించాయి.
జిల్లాలో మొదటిసారి రూ.2 వేల నోట్లు చెలామణిలోకి తెచ్చిన ఆంధ్రాబ్యాంకు అధికారులు.. ఇప్పుడు కొత్త రూ.500 నోట్లు కూడా ఇవ్వాలని తాపత్రయపడుతున్నారు. బహుశా శుక్రవారం ఇవి రావచ్చని చెబుతున్నారు. అయితే వీటిని ఏటీఎంలకే పరిమితం చేయాలని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బ్యాంకుల ద్వారా ఇచ్చే పరిస్థితి లేదు. అవి కూడా పరిమితంగా రావచ్చంటున్నారు.
సోమవారం నుంచి ఆంధ్రాబ్యాంకు ఏటీఎంలు పూర్తి స్థాయిలో పనిచేయనున్నట్లు సీనియర్ మేనేజర్ ఒకరు తెలిపారు. ఇప్పటివరకు నగదు మార్పిడి, విత్‌డ్రాల ద్వారా రూ.700 కోట్ల వరకు పంపిణీ జరిగిందని, అందులోనూ కొత్త రూ.100 నోట్లు పెద్దఎత్తున ఇచ్చినా అవి బయట ప్రజల మధ్య పరస్పరం మార్పిడి జరగడం లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. స్వైప్ మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. వాటి గురించి కనీసం 10 శాతం మందికి కూడా సరైన అవగాహన లేకపోవడంతో నగదు రహిత లావాదేవీలకు కష్టంగానే ఉంటుందని బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు.