
అద్దె ఇల్లు.. ఆరుబయట శవం!
♦ ఇంట్లోకి అనుమతివ్వని యజమాని
♦ గ్రామ నడిబొడ్డు నుంచే అంత్యక్రియలు
చండ్రుగొండ : అంటు అనే మూఢ నమ్మకంతో మృతదేహాన్ని తన ఇంట్లోకి తీసుకురావద్దన్న యజమాని. పుట్టెడు దుంఖఃలో ఉన్న ఆ కుటుంబం రామ నడిబొడ్డున టెంటు కింద మృతదేహాన్ని ఉంచాల్సిన పరిస్థితి. ఈ సంఘటన మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన యన్నం పుల్లారావు(25) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి నర్సమ్మతో కలిసి కొన్నేళ్లుగా ఓ వ్యాపారి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఏడాది క్రితం కల్లూరుకు చెందిన యువతితో వివాహం జరిగింది. కొద్ది రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవ జరగగా.. మనస్తాపం చెందిన పుల్లారావు పురుగుల మందు తాగాడు.
కొత్తగూడెంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పుల్లారావు మృతదేహాన్ని మంగళవారం రాత్రి అద్దె ఇంటి వద్దకు తీసుకురాగా.. యజమాని లోపలికి తెచ్చేందుకు అనుమతించలేదు. చేసేది లేక మృతదేహాన్ని గ్రామ బొడ్రాయి సెంటర్‌లో టెంటు కింద ఉంచారు. విషయం తెలిసిన వందలాది మంది గ్రామస్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి యజమానిని ఒప్పించేందుకు యత్నించినప్పటికీ వినలేదు. దీంతో బుధవారం మధ్యాహ్నం గ్రామ నడిబొడ్డు నుంచే అంత్యక్రియలు నిర్వహించారు. సమాజం ఓ వైపు సాంకేతికపరంగా ముందడుగు వేస్తుంటే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం మూఢ నమ్మకాలు మానవ విలువలను మంటగలుపుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.