వర్షంపై భయపెట్టేలా పోస్టులు పెడితే కేసులే
సాక్షి,సిటీబ్యూరో: సామాజిక మధ్యమాల్లో అసత్యప్రచారాలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు పెడతామని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌రూమ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు.
తురక చెరువుకు గండిపడే ప్రమాదం ఉన్నందున పరిసరాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిం దిగా సూచించారు. చెరువు ప్రాంతాల్లో నిర్మాణాలు చేసినందునే వర్షాలకు సెల్లార్లు కుంగుతున్నాయని, వర్షం తగ్గకపోతే పిల్లర్లు కూడా కూలే ప్రమాదం ఉందన్నారు. బండారి లేఔట్ తదితర ప్రాంతాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
హుస్సేన్‌సాగర్‌కు ప్రమాదం ఉందని, కాప్రా చెరువు తగ్గుతుందని సోషల్ మీడియాల్లో వస్తున్న ప్రచారాన్ని నమ్మరాదన్నారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై క్రిమినల్ చర్యలకు వెనుకాడబోమన్నారు.