అది ముగిసిన చరిత్ర..: వర్మతో నెహ్రూ
విజయవాడ (గుణదల): ‘బెజవాడ ఇప్పుడు పవిత్రంగా ఉంది.. 30 ఏళ్ల కిందట జరిగిన సంఘటనలపై ఇప్పు డు సినిమా తీసి నగరంలో కల్మషాలు సృష్టించవద్దని’ సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మకు మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) హితవు పలికారు. ‘వంగవీటి’ సినిమా నిర్మాణంలో భాగంగా శుక్రవారం నగరానికి వచ్చిన రాంగోపాల్‌వర్మ శనివారం గుణదలలో నెహ్రూను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ.. సినిమా అనేది వ్యాపారం.. ఎవరు ఎలాంటి అంశాన్ని అయినా ఎంచుకుని సినిమా తీయవచ్చన్నారు.
రెండు కుటుంబాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు అప్పుడున్న పరిస్థితుల్లో కుల రాజకీయాలకు దారితీశాయని తెలిపారు. ముగిసిపోయిన ఆ చరిత్రను కొత్తగా పరిచయం చేయడం వల్ల ప్రయోజనం లేదని వివరించారు. బెజవాడ కమ్యూనిస్టులకు కంచుకోట.. సినిమా పరిశ్రమకు వెన్నెముక లాంటిదని.. పత్రికారంగానికి తలమానికమైనదని చెప్పారు. నగరంలో చోటుచేసుకున్న కొన్ని ఘర్షణలు.. వివాదాలు తెరకెక్కించడం వల్ల వచ్చే ప్రయోజనం శూన్యమని పేర్కొన్నారు.