మంత్రి గారు.. మాట తప్పారు..
► 15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామన్న మంత్రి ‘కడియం’
► నేటికీ జాడలేని ప్రకటన ∙నిరుద్యోగుల్లో నిరాశ
► ప్రకటనలతో కాలం వెల్లదీస్తున్న ప్రభుత్వం
మంచిర్యాలసిటీ: ‘‘రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 15 రోజుల్లో టీఎస్‌పీ ఎస్సీ ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తాం..’’ ఇదీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఇదే నెల మూడో తేదీన చేసిన ప్రకటన. ఒక్కసారిగా నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు రేకెత్తించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా.. 15 రోజులు గడిచిపోయాయి. అయినా నేటికీ డీఎస్సీకి సంబంధించిన ప్రకటన ఊసేలేదు.
సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి మరోసారి మాట తప్పడం నిరుద్యోగులను నిరాశకు గురి చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ అంటూ అసెంబ్లీ నుంచి గల్లీ దాకా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రకటనలు గుప్పించారు. మరోసారి మాట తప్పడంతో ప్రజాప్రతినిధుల ప్రకటనలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఏ మంత్రి మాటకు ఎంత విలువ ఉందో తెలియక నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. నిరుద్యోగులను ఊరించడానికే ప్రభుత్వం ప్రకటనలతోనే కాలం వెళ్లదీస్తోందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోటాపోటీగా ప్రకటన
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి 15 రోజుల్లోగా నోటిఫికేషన్ ఇస్తామని ఈ నెల 3న మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అదే రోజు పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కూడా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. ఇరువై రోజులు దాటినా సంబంధిత శాఖ అధికారుల్లో మాత్రం హడావుడి కనిపించడంలేదు. మంత్రి, ఎంపీ పోటాపోటీగా ఒకే రోజు నిరుద్యోగులను ఊరించడానికి ప్రకటన చేయడం గమనార్హం.
నిరాశ..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ఏర్పడిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అనేక సార్లు డీఎస్సీపై ఆశలు కల్పించింది. నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వ ప్రకటనతో ఉద్యోగం సాధించాలనే ఆశయంతో పలువురు నిరుద్యోగులు శిక్షణ కేంద్రాల్లో చేరి వేలాది రూపాయలు ఖర్చు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన ప్రతీసారి శిక్షణలో చేరడం, సకాలంలో ప్రకటన రాకపోవడంతో తిరిగి ఇంటికి నిరాశతో చేరుకుంటున్నారు
కొడుకుకు ఉద్యోగం వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లలను శిక్షణకు పంపిస్తున్నారు. 2016 జనవరి 3న డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పలు పోస్టులను గురుకుల పాఠశాలల ఉపాధ్యాయ నియామకం కోసం కేటాయించి భర్తీ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విలీనానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మొదట ప్రకటించిన పోస్టుల సంఖ్య తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కొత్తేమి కాదు..!
నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడం కొత్తేమి కాదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇటీవల మంత్రి కడియం శ్రీహరి ఇచ్చిన ప్రకటనలు కనీసం పదికి పైగా ఉంటాయి. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దసరా కానుకగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించారు. ఆ తరువాత సంక్రాంతి కానుకగా డీఎస్సీ వస్తుందని అదే మంత్రి ఊరించారు. వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం కేసీఆర్ రెండు రోజుల్లో డీఎస్సీ ప్రకటన వేస్తామని ప్రకటించారు.
ఆ తరువాత బా«ధ్యతలు స్వీకరించిన కడియం శ్రీహరి కూడా ఇలాంటి ప్రకటనలతోనే నిరుద్యోగులను ఊరించారు. టెట్ తర్వాత డీఎస్సీ ఉంటుందని ఒకసారి, ఉపాధ్యాయుల, పాఠశాలల క్రమబద్ధీకరణ తర్వాత డీఎస్సీ ఉంటుందని మరోసారి, కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత వెంటనే డీఎస్సీ ఉంటుందని మరోసారి మంత్రి ఊరించే ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఇలా ఎన్నో ప్రకటనలు చేసిన మంత్రులు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడంపై నిరుద్యోగులకు నాయనా పులి వచ్చే అనే చందంలా ఉందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నోటిఫికేషన్ తేదీని సీఎం ప్రకటించాలి
డీఎస్సీ నోటిఫికేషన్‌కు సంబంధించిన తేదీని స్వయంగా రాష్ట్ర సీఎం ప్రకటించాలి. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ నిరుద్యోగులకు ఆశలు పెట్టే విధంగా ప్రకటనలు చేయరాదు. ఇది ఎన్నికల సమయం అంతకన్నా కాదు. రోజులతో ముడిపెట్టకుండా, స్పష్టమైన తేదీని ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి. ఇప్పటికే నిరుద్యోగులు కుటుంబాలకు దూరంగా ఉండి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుని తీవ్ర నిరాశతో ఉన్నారు. నిరుద్యోగుల ఆశలను అడియాశలు చేయకుండా, ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం కూడా ఉంది.
– కె.రవీందర్, టీటీసీ అభ్యర్థి, మంచిర్యాల