15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
- 8,792 టీచర్ పోస్టుల భర్తీ: కడియం
- పాత జిల్లాల ప్రకారమే నియామకాలు
- నియామక ప్రక్రియకు ఆరు నెలలు పడుతుంది
- అప్పటివరకు విద్యా వలంటీర్లతో బోధన
- 6 వేల స్కూళ్లలో జూన్ నుంచి బయోమెట్రిక్
- ఈసారి టీచర్ల బదిలీలు లేవని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 15 రోజుల్లో టీఎస్‌పీఎస్సీ ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. టీచర్ల నియామకాల ప్రక్రియకు ఆరు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందని, ఈలోగా ఇబ్బందులు తలెత్తకుండా విద్యా వలంటీర్లతో బోధన కొనసాగిస్తామని చెప్పారు. వేసవి సెలవుల తర్వాత జూన్‌లో పాఠశాలలు తెరిచే మొదటి రోజు నుంచే పాఠశాలల్లో విద్యా వలంటీర్లు ఉండేలా చర్యలు చేపడతామన్నారు. సచివాలయంలో బుధవారం పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అన్ని ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ప్రారంభిస్తాం. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్ స్కూల్స్, అన్ని గురుకులాలు మొత్తంగా 6 వేల పాఠశాలల్లో వచ్చే జూన్ నుంచి బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లోకి తెస్తాం. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈసారి మరిన్ని స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రారంభిస్తాం. గతేడాది ఒకటో తరగతిలో ఇంగ్లిషు మీడియం ప్రారంభించిన పాఠశాలల్లో ఈసారి రెండో తరగతి ప్రారంభం అవుతుంది. ఇంగ్లిషు మీడియం బోధించేందుకు ఆసక్తి కలిగి, ముందుకు వచ్చే వారికి నెల రోజుల పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తాం’’ అని వివరించారు. రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నందున కొత్త టీచర్ల నియామకాలను పాత జిల్లాల ప్రకారమే చేపడతామని పేర్కొన్నారు. ఈసారి రాష్ట్రంలో టీచర్ల బదిలీలు ఉండకపోవచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇప్పటికిప్పుడు టెట్ అవసరం లేదు
మరో 15 రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించబోమని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 లక్షల మందికిపైగా అభ్యర్థులు టెట్‌లో అర్హత సాధించిన వారు ఉన్నారన్నారు. వారంతా ప్రస్తుతం డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని, కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో టెట్ అవసరం లేదని అన్నారు.