వర్సిటీల్లో నియామకాలపై మరో కమిటీ
వర్సిటీల్లో నియామకాలపై మరో కమిటీ
Published Mon, Jul 17 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 4:10 PM
వీసీల సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం
- వారంలో నివేదిక, ఆ తర్వాతే తుది నిర్ణయం
- విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ బోధనా సిబ్బంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంతోపాటు నియామకాల్లో పాటించాల్సిన విధానాలపై అధ్యయనానికి మరో కమిటీ వేసినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ముగ్గురు వీసీలతో (ప్రొఫెసర్ రామచంద్రం, ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ సీతారామారావు) ఏర్పా టు చేసిన ఈ కమిటీ నివేదిక వారంలో వస్తుందని, ఆ తర్వాతే నియామకాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లతో కడియం ఆదివారం హైదరాబాద్‌లో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రొఫెసర్ తిరుపతి రావు కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చిందని, అయితే ఆ నివేదికలోని అంశాలపై మరోసారి అధ్యయనం చేసేం దుకు, నిబంధనలపై స్పష్టత కోరేందుకు మరో కమిటీని వేశామన్నారు.
పీహెచ్‌డీ అడ్మిషన్లలో జాప్యం వద్దు
వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,550 పోస్టుల్లో మొదటి విడతలో 1,061 పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా వాటి భర్తీపై నిర్ణయం తీసుకుంటామని కడియం వివరించారు. పీహెచ్‌డీ ప్రవేశాల్లో యుజీసీ నిబంధనల మేరకే నడుచుకోవాలని, అడ్మిషన్ల ప్రక్రియను జాప్యం చేయొద్దని వీసీలకు సూచించారు. పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చేలా వీసీల పని తీరు ఉండాలన్నారు. వివిధ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేం దుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పించా లని ఓయూలోని నాన్ బోర్డర్లు కోరారని, దీనిపైనా చర్చించామన్నారు. కొత్తగా అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు వసతి సదుపాయం కల్పించేందుకే కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులను నాన్ బోర్డర్లుగా ఉండొద్దని కోరుతున్నామన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులకు చెప్పాలని వీసీలను ఆదేశించారు.
సీఎం నమ్మకాన్ని వమ్ము చేయొద్దు...
ముఖ్యమంత్రి కేసిఆర్ విశ్వవిద్యాలయాలపై చాలా నమ్మకం పెట్టుకుని అడిగినన్ని నిధులు ఇస్తున్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వీసీలు బాగా పనిచేయాలని కడియం కోరారు. కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆలిండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ 2016 సర్వే ప్రకారం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య దేశంలో మొత్తంలో చూస్తే తెలంగాణలో అత్యధికంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీల్లో ఎక్కువ మంది చేరుతున్నారని, ఇది ఆహ్వానించదగిన పరిణామమన్నారు. అయితే పరిశోధనల్లో మాత్రం వెనుకబడ్డామని, వీసీలు వాటిపై దృష్టి సారించాలన్నారు. వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు మంజూరు చేసిన రూ. 420 కోట్లను త్వరగా ఖర్చు చేయాలన్నారు.
హాజరు కోసం బయోమెట్రిక్ మెషీన్లు తప్పనిసరి
విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్, డ్రగ్స్ సంస్కృతికి తావివ్వరాదని వీసీలు, రిజిస్ట్రార్లకు కడియం సూచించారు. కాలేజీలు, హాస్టళ్లు, పరిసర ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు పెట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పెంచేందుకు బయోమెట్రిక్ మెషీన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వర్సిటీల్లో విద్య, పరిశోధనలకు ప్రాధాన్యత కల్పించాలని, గత వైభవాన్ని తీసుకురావాలన్నారు. సభలు, సమావేశాలు, రాజకీయాలకు విశ్వవిద్యాలయాలను వేదికలుగా చేసుకునేందుకు అవకాశం ఇవ్వరాదన్నారు.
Advertisement
Advertisement