ఊరించి.. ఉసూరుమనిపించి!
కొత్తగూడెం: ‘పరీక్షలు రాయించారు... అర్హత సాధించాం.. తీరా నియామకం ముందు వయసు సరిపోలేదని తిరస్కరిస్తున్నారు. ఆరు నెలల నుంచి ఊరించి ఇప్పుడు మొండిచేయి చూపుతున్నారు. వయసు సరిపోనప్పడు పరీక్షకు ఎలా అనుమతించారు.’ అంటూ సింగరేణి జేఎం ఈటీ పరీక్షల్లో అర్హత సాధించని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం జూనియర్ మైనింగ్ ఇంజినీరింగ్ ట్రైనీ(జేఎంఈటీ) పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. దీనికి మైనింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసిన వారితోపాటు చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం కల్పించింది. పరీక్ష రాసే అభ్యర్థులు ఫిబ్రవరి 1, 2015 నాటికి 30 ఏళ్ల లోపు వారై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయసు సడలింపు ఉం టుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
నిబంధనల సడలింపుతో...
ఈ ఏడాది మే 10న జేఎంఈటీ పరీక్షలు నిర్వహించగా 894 మంది అభ్యర్థులు హాజరయ్యా రు. వీరిలో 682 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన వారిలో ఎక్కువమంది ఫైనలియర్ విద్యార్థులు ఉండటంతో వారి సర్టిఫికెట్లను అందించాలని యాజమాన్యం కోరింది. తాము ఫైనలియర్ చదువుతున్నామని, సర్టిఫికెట్లు వచ్చే వరకు నియామకాన్ని నిలిపివేయాలని అర్హత సాధించిన ఫైనలియర్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియ 6 నెలలపాటు వాయిదాపడింది. అనంతరం యాజమాన్యం నిబంధనలను సడలిస్తూ జూలై 1, 2015 నాటికి అభ్యర్థులు 18 ఏళ్లు నిండి ఉండాలని సర్క్యులర్‌ను జారీ చేసింది. దీంతో ఫైనలియర్ చదువుతూ అర్హత సాధిం చిన అభ్యర్థులు అనర్హులుగా మారారు. 811 పోస్టులకు నిర్వహించిన ఈ పరీక్షలకు 682 మంది ఉత్తీర్ణత సాధించగా అందులో 33 మంది ఫైనల్ విద్యార్థులు వయసు సరిపడక తిరస్కరణకు గురయ్యారు. నోటిఫికేషన్‌లో కనిష్ట వయోపరిమితిని విధించని యాజమాన్యం అర్ధాం తరంగా సర్క్యూలర్ ను జారీ చేసిందని, దీనిపై కోర్టుకు వెళ్తామని పేర్కొంటున్నారు.
అర్హత సాధించాం.. ఉద్యోగం ఇవ్వండి
ఉద్యోగ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులయ్యాం.. ఫైనలియర్ పరీక్షలో సైతం మంచి మార్కులతో పాసయ్యాం. మాకు ఉద్యోగం ఇవ్వకుండా వయసు సరిపోలేదని మధ్యలో నిబంధన విధించడంతో కేవలం రెండు, మూడు నెలల వయసు తేడా మాత్రమే ఉంది. నిబంధనను సడలించి మాకు ఉద్యోగం ఇవ్వాలి.
-వినీత్‌బాబు
కట్ ఆఫ్ డేట్ పెంచాలి
సింగరేణి యాజమాన్యం విడుదలచేసిన నోటిఫికేషన్‌లో మినిమమ్ ఏజ్ లిమిట్ నిబంధనను పెట్టకుండా ఫలితాలు వచ్చిన అనంతరం వయసు సరిపోలేదంటూ నిబంధనలు విధించడం సరికాదు. కటాఫ్‌డేట్‌ను పెంచి అర్హత సాధించిన ఫైనలియర్ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి.
-సుశీల్ కుమార్