వికటించిన ఆర్‌ఎంపీ వైద్యం
► అస్వస్థతకు గురైన కాంబ్లె దేవుబాయి
► ఐటీడీఏ అంబులెన్స్‌లో ఉట్నూర్ ఆస్పత్రికి తరలింపు
వారు అమాయక గిరిజనులు.. డాక్టర్లలో ఎంబీబీఎస్‌లు, ఎండీలు, ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఉంటారని కూడా తెలియని అమాయకత్వం వాళ్లది. వా రి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది డబ్బు పోగుచేసుకుంటున్నారు. వచ్చీరాని వైద్యంతో గిరిజన ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఏడాదో ఆర్నెల్లో ప్రయివేటు ఆస్పత్రిలో పని చేసి మెడలో స్టెతస్కోపు వేసుకుని తిరుగుతున్నారు. కనీస అర్హతలు లేకున్నా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
నార్నూర్ : మండల కేంద్రంలోని హరిఓం క్లినిక్‌లో ఆర్‌ఎంపీ వైద్యుడు గురువారం కొలామా గ్రామానికి చెందిన కాంబ్లె దేవుబాయికి వైద్యం అందించారు. వైద్యం వికటించడంతో ఆమె ఆస్వస్థతకు గురైంది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ వైద్యుడు శ్రీనివాస్ వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఐటీడీఏ అంబులెన్స్‌లో ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యం వికటించడంతోనే ఆమె ఆస్వస్థతకు గురైందని ప్రభుత్వ వైద్యుడు శ్రీనివాస్ తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులు బలిరాం, కాంబ్లె సుభాస్, భగవాన్‌లు తెలిపిన వివరాల ప్రకారం దేవుబాయికి జ్వరంతో పాటు కాళ్లు, చేతులకు నొప్పులు రావడంతో ఆర్‌ఎంపీ దగ్గరకి తీసుకెళ్లామని తెలిపారు.
గ్లోకోజ్ బాటిల్ ఎక్కించి, మూడు ఇంజక్షన్లు ఇచ్చి రెండు మాత్రలు ఇచ్చినట్లు తెలిపారు. ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని టెస్టుల పేరిట దండుకుంటున్నారని తెలుస్తోంది. మండలంలోని ఉమ్రి గ్రామానికి చెందిన అడే ఆశ్వర్య అనే బాలికను ఈ వైద్యుడే వైద్య పరీక్షలు నిర్వహించారు. మలేరియా నేగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు.
ఈ బాలికను ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించగా వైద్యుడు శ్రీనివాస్ మూడు సార్లు రక్త పరీక్షలు నిర్వహించగా మలేరియా నేగిటివ్‌గా నిర్ధారించారు. మలేరియా ఉదంటూ ఆర్‌ఎంపీ వైద్యుడు రూ. 200 తీసుకున్నారని బాలిక తల్లి అడే సంగీత తెలిపారు. కనీస అవగాహన లేని వైద్యులు వైద్యం పేరిట గిరిజన, దళితులను ఎలా మోసం చేస్తున్నారో తెలుస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యశాఖ అధికారులు ఉన్నతాధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ విషయమై ఆఎంపీ వైద్యుడు సర్కార్‌ను వివరణ కోరగా యాపిల్ ఇంజక్షన్ ఇచ్చి రెండు పారాసిటమాల్ మాత్రలు మాత్రమే ఇచ్చానని తెలిపారు. దేవుబాయి పరిస్థితి బాగానే ఉందని, వైద్యం అందించడంలో ఏ పొరపాటు జరగలేదని ఆర్‌ఎంపీ వివరణ ఇచ్చారు.